దండం పెట్టి మరీ అడుగుతున్న కేసీఆర్

తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. ఆ దిశగా ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ను పరుగులు పెట్టిస్తున్నారు. బహిరంగ సభలతో కేసీఆర్ కూడా రాష్ట్రంలో రాజకీయ వాతావారణాన్ని వేడెక్కించారు. కేసీఆర్ లాంటి నాయకుడు ఎన్నికల్లో నిలబడితే విజయం పక్కా అనే అభిప్రాయాలున్నాయి. గత రెండు ఎన్నికల్లోనూ కేసీఆర్ పేరుతోనే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారవుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దండం పెట్టి మరీ అడుగుతున్నా ఈ సారి కూడా గజ్వేల్ లో గెలిపించండి అని కేసీఆర్ స్వయంగా కోరడం తాజా పరిస్థితికి దర్పణం పడుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

వరుసగా రెండు సార్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత రావడం సహజమే. కానీ ఇది ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉందని తాజాగా కేసీఆర్ అర్థమైందని చెబుతున్నారు. లేదంటే తన కంచుకోట గజ్వేల్లో మూడోసారి గెలిపించాలంటూ కేసీఆర్ దండం పెట్టి కోరాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గెలిపించాలని దండం పెట్టి కోరుతున్నానని, గెలిచిన తర్వాత నెలకోసారి కచ్చితంగా గజ్వేల్ కు వస్తానని కేసీఆర్ పేర్కొన్నారు.

అయితే వరుసగా రెండు సార్లు గెలిచినా గజ్వేల్ లో ప్రజలను, పార్టీని కేసీఆర్ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో అక్కడి బీఆర్ఎస్ లోని కొంతమంది నాయకులు వ్యతిరేక వర్గంగా మారారు. కేసీఆర్ ను ఓడించడం కోసం పని చేస్తున్నారు. కేసీఆర్ పై పోటీ చేస్తే ఈటల రాజేందర్ కు మద్దతునిస్తామని కూడా ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు గజ్వేల్ లో ఓడిపోతాననే భయంతోనే కామారెడ్డిలోనూ కేసీఆర్ పోటీ చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందే జాగ్రత్త పడుతున్న కేసీఆర్.. ఓ మెట్టు దిగి విజయం కోసం అభ్యర్థిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.