తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్ర తొలి విడత కార్యక్రమం ముగిసింది. ఈ యాత్రలో కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలు పాల్గొన్నారు. బైక్ ర్యాలీలోనూ పాల్గొన్నారు. ఇక, బస్సు యాత్ర ముగింపు సందర్బంగా రాహుల్ గాంధీ ట్విట్టర్(ఎక్స్)లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ సునామీ సృష్టించనుందని ఆయన చెప్పారు. తనకు అన్ని వర్గాల ప్రజల నుంచి అందిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే ఈ విషయం చెబుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు “దొరల తెలంగాణకు-ప్రజల తెలంగాణకు” మధ్య జరుగుతున్నాయని రాహుల్ వ్యాఖ్యానించారు. దొరల పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఒక్క హామీని కూడా సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని.. రాహుల్ విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఎన్నెన్నో హామీలు ఇచ్చారని..ఇప్పటికీ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. అందుకే ప్రజలు తమవైపు చూస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడొస్తాయా? అని తెలంగాణ సమాజం ఎదురు చూసిందని తెలిపారు.
డిసెంబరు 3న వెల్లడయ్యే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సునామీ రాబోతోందని రాహుల్ గాంధీ చెప్పారు. కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బంగారు తెలంగాణ రాష్ట్రానికి నాది గ్యారెంటీ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మరి ఆయన చెప్పినట్టే జరుగుతుందేమో చూడాలి. మొత్తానికి రాహుల్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.