బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బిజీలో పడిపోయారు. పార్టీని మూడో సారి అధికారంలోకి తేవడం కోసం పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై, పార్టీపై ఎలాంటి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నారు. ప్రత్యర్థి పార్టీల ఆరోపణలను, విమర్శలను ఎప్పటికప్పుడూ తిప్పి కొడుతున్నారు. కానీ ఒక విషయంలో మాత్రం కేటీఆర్ తడబడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లాజిక్ లేకుండా వ్యహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో ప్రవళిక అనే యువతి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. రాజకీయ పరంగా ఈ ఆత్మహత్య హాట్ టాపిక్ గా మారింది.
ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న ఆమె.. గ్రూప్- 2 పరీక్షలు వాయిదా పడటంతోనే ఆత్మహత్య చేసుకుందని నిరుద్యోగ సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ప్రవళిక చనిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో భారీగా నిరసన కూడా చేపట్టారు. కానీ ప్రవళిక మరణానికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు పేర్కొన్నారు. శివరామ్ రాథోడ్ అనే వ్యక్తిని ఆమె ప్రేమించిందని చెప్పారు. కానీ శివరామ్ మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో తట్టుకోలేక ప్రవళిక మరణించిందని వెల్లడించారు. ప్రవళిక కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని చెప్పడంతో పాటు ప్రవళిక చనిపోవడానికి శివరామ్ పెట్టిన టార్చరే కారణమని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో కేటీఆర్ ప్రతిపక్షాలపై చెలరేగారు. ప్రవళిక మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏ ప్రభుత్వ ఉద్యోగానికి కూడా దరఖాస్తు చేసుకోలేదని అన్నారు. ఈ క్రమంలోనే ప్రవళిక కుటుంబానికి అండగా ఉంటామని, ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడీ ప్రకటనే విమర్శలకు దారితీస్తోంది. ప్రేమ వ్యవహారం కారణంగా ఆ యువతి చనిపోయారని చెబుతున్నారు కరెక్టే కానీ ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ ప్రేమ కారణంతో చనిపోయిన అందరి కుటుంబాల్లోనూ ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారా? అని కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రవళిక ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుందనే ఆధారాలను కాంగ్రెస్ చూపిస్తోంది. దీంతో పరీక్ష వాయిదా పడిందనే ప్రవళిక చనిపోయారని, దీన్ని కప్పి పుచ్చేందుకే ఆమె సోదరుడికి ఉద్యోగం ఇస్తామని కేటీఆర్ ప్రకటించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates