సెంటిమెంటు బాట‌లో రాహుల్‌.. కేసీఆర్‌ను మించి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆమేరకు దూకుడు పెంచింది. తాజాగా విజ‌య‌భేరి స‌భ‌ల పేరుతో ఎన్నిక‌ల స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తోంది. తాజాగా పెద్ద‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన కాంగ్రెస్ విజ‌య‌భేరి స‌భ‌లో అగ్ర‌నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సీఎం కేసీఆర్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీల‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ను అబద్ధాల కోరుగా ఆయ‌న అభివ‌ర్ణించారు. అదేస‌మ‌యంలో మోడీని మోస‌గాడిగా పేర్కొన్నారు.

ఈ ఇద్ద‌రి వ‌ల్ల తెలంగాణ‌కు ఒరిగింది ఏమీ లేద‌ని రాహుల్ వెల్ల‌డించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాల‌న చేస్తుంటే.. కేంద్రంలో మోడీ.. త‌న వ్యాపార మిత్రుల‌తో క‌లిసి.. పాల‌న సాగిస్తున్నార‌ని దుయ్య బ‌ట్టారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో ల‌క్ష కోట్ల రూపాయ‌ల అవినీతి జ‌రిగింద‌ని ఆరోపించారు. దీనివ‌ల్ల ఇక్క‌డి రైతుల‌కు ఎలాంటి మేలు జ‌ర‌గలేద‌ని.. ముఖ్య‌మంత్రి అనుగ్ర‌హం ఉన్న కొంద‌రు కాంట్రాక్ట‌ర్ల‌కు మాత్రం ల‌బ్ధి చేకూరింద‌ని అన్నారు.

రాష్ట్రంలో దొర‌ల తెలంగాణ‌కు.. ప్ర‌జ‌ల తెలంగాణ‌కు మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధంగా ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌ను రాహుల్ అభివ‌ర్ణించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాల‌న సాగిస్తున్నార‌ని అన్నారు. ధ‌రణి పేరుతో భూముల రికార్డులు మార్చేసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. పెద్ద పెద్ద రైతులకే రైతు బంధు లాభం ద‌క్కింద‌ని విమ‌ర్శించారు.

రాహుల్ కూడా సెంటిమెంటు బాట‌

కాగా, తెలంగాణ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ పార్టీ నేత‌లు త‌ర‌చుగా సెంటిమెంటును పండించే ప్ర‌య‌త్నం చేస్తార‌నే టాక్ ఉంది. అయితే.. తాజాగా రాహుల్ గాంధీ కూడా సెంటిమెంటు బాట‌లో ప్ర‌యాణం ప్రారంభించారు. “తెలంగాణకు వస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు తెలంగాణతో ఉన్న సంబంధం… రాజకీయ సంబంధం మాత్ర‌మే కాదు. కుటుంబంతో ఉన్న అనుబంధం నాది. 2004లోనే తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా ప్రకటన చేశాం. సోనియా నిర్ణయం తీసుకున్నారు. ఆ త‌ర్వాతే.. ఎన్నో క‌ష్టాల‌కు ఓర్చుకుని రాష్ట్రాన్ని ఇచ్చాం. మ‌రి మీరు ఒక్క ఓటు ఇవ్వ‌లేరా?” అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు విన్న‌వారు సీఎం కేసీఆర్ ను మించి సెంటిమెంటు పండిస్తున్నారే.. అని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

6 గ్యారెంటీలూ తొలి కేబినెట్‌లోనే..

తెలంగాణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ ప్ర‌క‌టించిన 6 గ్యారెంటీను కాంగ్రెస్ స‌ర్కారు ఏర్ప‌డిన తొలి కేబినెట్‌లోనే అమ‌లు చేస్తామ‌ని రాహుల్ హామీ ఇచ్చారు. అధికారం‌లోకి వచ్చిన మొదటి రోజే అమలు చేస్తామ‌న‌న్నారు. “కేసీఆర్ ఇక మీ ప్రభుత్వం ఉండదు. ప్రజల ప్రభుత్వం రాబోతోంది” అని రాహుల్ ధీమా వ్య‌క్తం చేశారు.