తెలంగాణ ఎన్నిక‌ల్లో బీజేపీ ఆట‌లో అరటిపండేనా?

తెలంగాణ ఎన్నిక‌ల్లో బీజేపీ ప‌రిస్థితి ఏంటి? ఆ పార్టీ ఏమేర‌కు నెగ్గుకు రాగ‌ల‌దు. అధికారంలోకి వ‌స్తాం.. వ‌చ్చేస్తాం.. అని చెబుతున్న క‌మ‌ల నాథుల ఆశ‌లు నెర‌వేరేనా? అస‌లు ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఏమేర‌కు పోటీ ఇస్తుంది? ఇవీ.. ఇప్పుడు క్షేత్ర‌స్థాయిలో రాజ‌కీయ వ‌ర్గాలే కాకుండా.. సాధార‌ణ పౌరుల్లోనూ చ‌ర్చ‌గా మారిన విష‌యాలు. కేడ‌ర్ ప‌రంగా చూసుకుంటే.. కొన్నికీల‌క‌మైన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో మాత్ర‌మే బీజేపీకి ఒకింత బ‌లం ఉంది. గ్రామీణ స్థాయిలో మాత్రం బీజేపీని ప‌ట్టించుకునే నాథుడు లేడు.

అదేస‌మ‌యంలో ప‌ట్ట‌ణ‌, న‌గ‌ర ఓట‌రు నాడిని బీజేపీ ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం లేదనే టాక్ వినిపి స్తోంది. తెలంగాణ ఇవ్వ‌డంలోనూ.. సాధించ‌డంలోనూ.. త‌మ పాత్ర ఉంద‌ని చెబుతున్నా.. ఇది అయిపో యిన ముచ్చ‌ట‌గానే చ‌ర్చ సాగుతోంది. నిజాం పాల‌న నుంచి తెలంగాణ విముక్తి పొందిన రోజును విమోచ‌న దినంగా రాష్ట్ర వ్యాప్తంగా చేసి.. ఆమేర‌కు మార్కులు వేసుకోవాల‌ని చూసినా.. అది కూడా బీజేపీకి ప్ర‌యాస‌గానే మారింది.

ఇక‌, ఉచితాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం బీఆర్ ఎస్ స‌ర్కారును విమ‌ర్శిస్తున్న నాయ‌కులు.. ఉచితాల వైపు మొగ్గు చూపే ప‌రిస్థితి లేదు. అయితే.. కేంద్రం ఇచ్చిన ప‌థ‌కాలు, ముఖ్యంగా ప‌సుపు బోర్డు ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌ధాని చేసిన ప్ర‌క‌ట‌న‌, కృష్ణాజ‌లాల విష‌యంలో కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం, గిరిజ‌న యూనివ‌ర్సిటీ ఏర్పాటు ప్ర‌క‌ట‌న వంటివి త‌మ‌కు లాభిస్తాయ‌ని రాష్ట్ర క‌మ‌ల నాథులు ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, ఎటొచ్చీ.. హిందూత్వ అజెండాను మాత్రం వ‌దిలి పెట్ట‌డం లేదు.

దీంతో బీజేపీకి ఆశించినంత విశ్వ‌స‌నీయ‌త అయితే.. ప్ర‌స్తుతం క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త 2018 ఎన్నిక‌ల్లో కేవ‌లం ఘోషా మ‌హ‌ల్ విజ‌యానికి మాత్ర‌మే ప‌రిమిత‌మైన బీజేపీ, త‌ర్వాత‌.. జ‌రిగిన దుబ్బాక‌, హుజారాబాద్ ఉప ఎన్నిక‌ల్లో మాత్రం కొంత పుంజుకుంది. ఇక‌, జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో కొంత మెరుగైన సీట్లు సాధించింది. అయితే.. అవ‌న్నీ కూడా.. అభ్య‌ర్థుల బ‌లంపైనే నెట్టుకొచ్చిన ఎన్నిక‌లుగా ప్ర‌చారం ఉంది.

మ‌రోవైపు.. బీజేపీని బూచిగా చూపిస్తున్న కాంగ్రెస్ ప్ర‌చారం.. జోరుగా ప్ర‌జ‌ల్లోకి వెళ్తోంది. బీజేపీ-బీఆర్ ఎస్ ఒక్క‌టేనని.. ఈ రెండు పార్టీలూ.. కూడ‌బ‌లుక్కుని.. ఎన్నిక‌ల్లో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాయ‌ని .. తాజాగా కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ కూడా చెప్పుకొచ్చారు. మ‌రోవైపు కీల‌క ఎన్నిక‌ల స‌మ‌యంలో బండి సంజ‌య్ వంటి ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు బీజేపీకి లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. వెర‌సి మొత్తంగా తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ ఆట‌లో అర‌టి పండుగా మారుతుందా? లేక స‌త్తా చాటుతుందా? అనేది చూడాలి.