ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరోసారి ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అవినీతి చేశారంటూ.. ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేయడం తెలిసిందే. అనంతరం.. ఆయనను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచడం.. అక్కడి నుంచి కోర్టు ఆదేశాలతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
తాజాగా రిమాండ్ గడువు గురువారం(అక్టోబరు 19)తో ముగిసింది. దీంతో జైలు అధికారులు కోర్టుకు ఈ విషయం తెలియజేశారు. మరోవైపు కోర్టు కూడా వర్చువల్‌గా చంద్రబాబును హాజరు పరచాలని ఆదేశించింది. దీంతో వర్చువల్‌గా చంద్రబాబు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయాధికారి.. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అని చంద్రబాబును ప్రశ్నించినట్టు ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు.
అంతేకాదు.. ఇటీవల ఏసీ విషయంలో తలెత్తిన వివాదాన్ని కూడా న్యాయాధికారి ప్రస్తావించినట్టు తెలిసింది. టవర్ ఏసీ పెట్టాలని తాము ఆదేశించామని.. దానిని వినియోగంలోకి తెచ్చారా? ఇప్పుడు జైలు గది వాతావరణం ఎలా ఉందని చంద్రబాబును ప్రశ్నించినట్టు సమాచారం. మొత్తానికి ఆయా అంశాలపై సానుకూలంగానే సమాధానం చెప్పిన చంద్రబాబు వ్యక్తిగత వైద్యులతో తాను వైద్యం చేయించుకుంటున్నట్టు తెలిపారు.
అయితే.. జైలులో తన భద్రతకు సంబంధించి అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో ఉన్న తన ఫొటోలను కొందరు తీసి మీడియాకు ఇస్తున్నారని.. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిపినట్టు న్యాయవాదులు పేర్కొన్నారు. అయితే.. ఆయా విషయాలను పోలీసులు విచారిస్తున్నట్టు తమకు సమాచారం ఇచ్చారని న్యాయాధికారి వెల్లడించారు. ఈ క్రమంలో రిమాండ్‌ను నవంబరు 1వ తేదీవరకు పొడిగిస్తూ.. ఉత్తర్వులు ఇచ్చారు.