తెలంగాణలో పోటీకి దిగాలన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆలోచన ఆచరణలోకి రావడం లేదని తెలుస్తోంది. గడిచిన ఐదేళ్లలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా తెలంగాణ రాజకీయాల మీద కానీ.. తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద కానీ పవన్ మాట్లాడలేదు. కానీ ఎన్నికల వేళ బరిలోకి తమ అభ్యర్థుల్ని దింపాలన్న ఆలోచనకు రావటం.. అందుకు తగ్గట్లే ప్రకటన వెలువడటం తెలిసిందే.
జనసేన బరిలోకి నిలిస్తే అధికార బీఆర్ఎస్ కు మేలు జరగటం ఖాయమంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు.. విపక్షాలకు పడాల్సిన ఓట్లు జనసేనకు పడటం ద్వారా.. కేసీఆర్ కు మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ పోటీ చేయాలని భావిస్తున్న 30 స్థానాల్లో పార్టీ ఉనికి.. స్థానిక నాయకత్వం పెద్దగా లేకున్నా.. పవన్ ఛరిష్మా ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. అందుకే.. జనసేన పార్టీని ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలని బీజేపీ కోరింది.
గతంలోనూ గ్రేటర్ ఎన్నికల వేళలోనూ.. ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో పోటీ నుంచి విరమించుకున్న పవన్.. తాజా అసెంబ్లీ ఎన్నికల వేళలో తాము బరిలోకి దిగుతామని చెప్పటం తెలిసిందే. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ లు పవన్ తో భేటీ కావటమే కాదు.. పార్టీ సందేశాన్ని ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయొద్దని.. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో పొత్తు సఫలం కాదన్న విషయాన్ని పవన్ కు చెప్పేయటమేకాదు.. అధిష్ఠాన సూచనను పాటించాల్సిందిగా మరీ మరీ కోరినట్టు తెలుస్తోంది. ఈ కారణంతోనే.. పార్టీలో కన్ఫ్యూజ్ లేకుండా చేసేందుకు హడావుడిగా ప్రెస్ నోట్ విడుదల చేసినట్లు చెబుతున్నారు.
విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే అవకాశం లేదని.. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ.. ఏ రీతిలో అయితే పోటీకి దూరంగా ఉన్నారో.. అలాంటి సీన్ రిపీట్ కావటం ఖాయమన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇదంతా ముందే మాట్లాడకుని ఉంటే బాగుండేదని జనసేన నేతలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates