నారా భువ‌నేశ్వ‌రి.. ‘నిజం గెలవాలి’

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌స్తుతం రాజ‌మండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో గ‌త 40 రోజుల‌కు పైగానే ఆయ‌న బెయిల్‌, కేసులు, ఏపీ స‌ర్కారు ఉద్దేశ పూర్వ‌క చ‌ర్య‌ల‌పై టీడీపీ నాయ‌కులు అంతా పోరుబాట ప‌ట్టారు. ఇటు న్యాయ‌స్థానం, అటుప్ర‌జ‌ల్లోకి కూడా వెళ్లి.. వైసీపీ ప్ర‌భుత్వ వైఖ‌రిని ఎండ‌గ‌డుతున్నారు. దీంతో కీల‌క‌మైన ఎన్నిక‌ల‌కు ముందు.. టీడీపీ కార్య‌క్ర‌మాలు ముందుకు సాగ‌డం లేదు. అంద‌రూ చంద్ర‌బాబు కోస‌మే ఉద్య‌మిస్తున్నారు త‌ప్ప‌.. ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్ట‌లేక పోతున్నారు.

దీంతో పార్టీ ప‌రంగా ఎన్నిక‌ల‌కు ముందుకు వెళ్లే ప‌రిస్థితి కొంత మేర‌కు మంద‌గించింది. దీనిని గ‌మ‌నించిన పార్టీ యంత్రాంగం.. తాజాగా ఉన్న‌త‌స్థాయిలో చ‌ర్చ‌లు జ‌రిపింది. పార్టీ కీల‌క నాయ‌కులు తాజాగా చ‌ర్చించారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రిని ప్ర‌జా క్షేత్రంలోకి దింపాల‌ని ముక్త‌కంఠంతో నిర్ణ‌యించారు. నిజం గెల‌వాలి పేరుతో నారా భువ‌నేశ్వ‌రి త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చేలా కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర వచ్చే వారం నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు.

చంద్రబాబు అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను కూడా ఈ యాత్ర రూపంలో నారా భువ‌నేశ్వ‌రి పరామర్శించనున్నారు. వారానికి కనీసం రెండు మూడు చోట్ల భువనేశ్వరి పర్యటన ఉండేలా టీడీపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో ఆగిపోయిన భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించ‌నున్నారు. దీనిలో భాగంగా చంద్రబాబు స్థానంలో నారా లోకేష్ జనంలోకి వెళ్లనున్నారు. పార్టీ కార్యక్రమాలపై నిర్వహణ, సమీక్షపై నాలుగైదు రోజుల్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. బాబుతో నేను కార్యక్రమం నిర్వహిస్తూనే ప్రజల సమస్యలపై పోరాటాలు, పార్టీ కార్యక్రమాల స్పీడు పెంచాలని కీల‌క నేత‌లు నిర్ణ‌యించారు.