ఎన్నో ఆకాంక్షలతో ఎంతో మంతి ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన దురదృకరంగా సాగిందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు, సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరూ ఆనందంగా లేరని అన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌యేనని.. చెప్పారు. ఎన్నోకోరికలతో నీళ్లు-నియామకాలు నినాదంతో ఏర్పడిన రాష్ట్రంలో ఏ ఒక్కరికీ సామాజికన్యాయం జరగలేదన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రియాంక గాంధీ చెప్పారు.
“తెలంగాణ ఒక పుణ్యభూమి. తెలంగాణ కోసం ఎంతోమంది జీవితాలు త్యాగం చేశారు. తెలంగాణ ప్రజల కలలను కాంగ్రెస్ అర్థం చేసుకుంది. ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చాం. రాజకీయ మూల్యం చెల్లించి మరీ తెలంగాణ ఇచ్చాం. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల ఆకాంక్షలకే విలువ ఇస్తుంది” అని ప్రియాంకగాంధీ అన్నారు. కేసీఆర్ పాలన కేవలం కుటుంబ సభ్యులకుఉద్యోగాలు ఇచ్చేందుకు, వారు చేసిన అవినీతి నుంచి వారిని కాపాడుకునేందుకు మాత్రమే పరిమితం అయిందని చెప్పుకొచ్చారు.
“తొమ్మిదేళ్ల తెలంగాణలో అత్యాచారాలు, అరాచకాలు, ఆత్మహత్యలు, ఆధిపత్యమే కనిపిస్తుంది. రాష్ట్రాన్ని రక్షించేందుకు సోనియా గాంధీ కుటుంబం మీ ముందుకు వచ్చింది. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన విషయం మీకు తెలిసిందే. అయినా.. ఈ పదేళ్లలో ఇక్కడి ప్రజల ఆకాంక్షలు ఏ మాత్రం నెరవేరలేదు. అందుకే సోనియా గాంధీ 6 గ్యారంటీలు ఇచ్చారు. పేద ఆడబిడ్డల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు, తులం బంగారం ఇస్తాం. ములుగులో సీతక్కను, భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణరావును గెలిపించాలి“ అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ములుగు జిల్లా రామాంజపురంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రియాంకగాంధీ ప్రసంగించారు.