టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, జైలుపై తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖులు చాలా వరకు మౌనంగా ఉన్నారు. ఒకరిద్దరు తప్ప ఎవరూ ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. ఈ పరిణామాలపై విమర్శలు వస్తున్నా.. టాలీవుడ్ నుంచి పెద్దగా స్పందన లేదు. ఈ క్రమంలో తాజాగా నటుడు నరేష్ స్పందించారు. ధర్మం నిలబడుతుందని, విజయం దక్కుతుందని ఆయన చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే.. తాను ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు చెప్పారు. ఏ రాజకీయ నేత గురించి కూడా తాను ప్రత్యేకంగా ఇంట్రస్ట్ చూపించడం లేదని చెప్పారు.
కానీ, ధర్మం అనేది ఒకటి ఉంటుందని, అది మొదట్లో కొంత ఒడిదుడుకులకు లోనైనప్పటికీ..అంతిమంగా విజయం సాధిస్తుందని నరేష్ వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు విషయంపై ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు తడుము కోకుండా సమాధానం చెప్పారు. వ్యక్తిగత దూషణతో లేదా అణచివేత కోసం ఎవరినైనా బంధించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో తిరుగుబాటును సూచిస్తుంది అని అన్నారు. ఇది చివరకు తిరుగుబాటుకు దారితీస్తుందని చెప్పారు.
గతంలో ఇందిరాగాంధీ హయాంలో దేశంలో ఎమర్జెన్సీ వచ్చిందని.. ఆ ఎమర్జెన్సీ సమయంలో దేశంలోని చాలామంది నాయకులు జైల్లో ఉన్నారని నరేష్ గుర్తుచేశారు. తర్వాత ఏమైందో అందరికీ తెలుసని చెప్పారు. పరోక్షంగా ఆయన వచ్చే ఏపీ ఎన్నికలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ దేశ చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోయిందని, ఇప్పుడు ఏపీలోనూ అలాంటి పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు.
రాజకీయాల్లోకి నేతల కుమారులు, కోడళ్లు, అల్లుళ్లు రావడం ఎంత వరకు సరైందో తనకు తెలియదన్నారు. అయితే నాయకులు సరిగ్గా పనిచేస్తేనే ప్రజల్లో ఆదరణ ఉంటుందన్నారు. ఇప్పుడున్న రోజుల్లో రాజకీయం అనేది డబ్బుతోనే ముడిపడి ఉందన్నారు. ఈ ముడిని విప్పడం ప్రజల చేతుల్లోనే ఉందని నరేష్ చెప్పారు. ఇక, జనసేన అధినేత పవన్ గురించి మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమకు చెందిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం స్వాగతించాల్సిన విషయమన్నారు. ఆయన చేస్తున్న పోరాటానికి అందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates