జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌తో కిష‌న్‌రెడ్డి మంత‌నాలు!

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను.. బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు, కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీ ల‌క్ష్మణ్ క‌లుసుకున్నారు. హైద‌రాబాద్‌లోని ప‌వ‌న్ నివాసంలో ప్ర‌త్యేకంగా భేటీ అయిన వీరు.. తెలంగాణ రాజకీయాలు.. అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై చ‌ర్చించిన‌ట్టు తెలిసింది. ఈ రోజు మ‌ధ్యాహ్నం.. ప్ర‌త్యేకంగా ప‌వ‌న్ ఇంటికి చేరుకున్న కిష‌న్‌రెడ్డి, ల‌క్ష్మ‌ణ్‌లు.. ప‌వ‌న్‌తో భేటీ కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ప్ర‌స్తుతం జ‌న‌సేన‌-బీజేపీ పొత్తులో ఉన్న విష‌యం తెలిసిందే. వీరి పొత్తు ఏపీలో కొన‌సాగుతోంది. ఈ క్ర‌మం లో తెలంగాణ‌లోనూ త‌మ‌కు స‌హ‌క‌రించాలని కిష‌న్‌రెడ్డి ప‌వ‌న్ కోర‌నున్న‌ట్టు తెలిసింది. ఎలానూ పొత్తులో ఉన్నాం కాబ‌ట్టి తెలంగాణ‌లోనూ త‌మ‌కు ప్ర‌చారం చేయాల‌ని.. త‌మ‌కు స‌హ‌క‌రించాల‌ని, బీజేపీ స‌ర్కారు ఏర్ప‌డేందుకు దోహ‌ద ప‌డాల‌ని కిష‌న్ రెడ్డి ప‌వ‌న్‌కు సూచించినట్టు స‌మాచారం.

కేంద్రంలోని పెద్ద‌ల సూచ‌న‌లు, వారి మార్గ‌నిర్దేశంలోనే తాము ప‌వ‌న్‌ను క‌లిసిన‌ట్టు కిష‌న్ రెడ్డి చెప్పార‌ని స‌మాచారం. తెలంగాణ జ‌న‌సేన పోటీకి దూరంగా ఉండి.. బీజేపీకి స‌హ‌క‌రించాల‌ని.. కిష‌న్‌రెడ్డి కోరిన‌ట్టు స‌మాచారం. దీంతో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఇదిలావుంటే.. ఇదే రోజు.. జ‌న‌సేనపార్టీ తెలంగాణ నాయ‌కులు మాత్రం పోటీకి సిద్ధ‌మ‌ని.. ఇప్పుడు పోటీ చేయ‌క‌పోతే.. ప్ర‌జ‌ల్లో బ్యాడ్ అయిపోతామ‌ని.. ప‌వ‌న్‌కు తేల్చి చెప్పారు.

ఇది జ‌రిగిన కొన్నినిమిషాల్లోనే బీజేపీ నాయ‌కులు వ‌చ్చి ప‌వ‌న్‌తో భేటీ కావ‌డం సంచ‌ల‌నంగా మారింది. మ‌రి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పార్టీ పోటీ చేస్తుందా? లేదా? అన్న‌ది చూడాలి. ఇదిలావుంటే.. తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌ని..కొన్నాళ్ల కిందట చెప్పిన ప‌వ‌న్‌.. తాజాగా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌లై.. రోజులు వారాలు గ‌డుస్తున్నా.. మౌనంగా ఉండ‌డం.. అస‌లు త‌న‌కు ఏమీ తెలియ‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం.