లండ‌న్‌లో వైసీపీ సోష‌ల్ మీడియా ఆత్మీయ స‌మావేశం

రాష్ట్రం కోసం, రాష్ట్ర‌ప్ర‌జ‌ల కోసం సీఎం జ‌గ‌న్ అనుక్ష‌ణం త‌పిస్తున్నార‌ని.. క‌ష్ట‌ప‌డుతున్నార‌ని వైసీపీ సోష‌ల్ మీడియా విబాగం కో ఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల భార్గ‌వ్‌రెడ్డి అన్నారు. బ్రిట‌న్ రాజ‌ధాని లండ‌న్‌లో వైసీపీ సోష‌ల్ మీడియా విభాగం ఆత్మీయ స‌మావేశం ఘ‌నంగా జ‌రిగింది. ఈ స‌మావేశానికి బ్రిట‌న్ వైసీపీ క‌న్వీన‌ర్ డాక్ట‌ర్ చింతా ప్ర‌దీప్‌రెడ్డి, వైసీపీ నేత ఓవుల్‌రెడ్డి నేతృత్వం వ‌హించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైసీపీ ఏపీ మీడియా, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి, ఏపీఎన్నార్‌టీఆఎస్ అధ్యక్షుడు మేడపాటి వెంకట్, ఏపీ ఎస్ ఎస్ డీసీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూధన్ రెడ్డి, వైసీపీ అమెరికా కన్వీనర్ పండుగాయల రత్నాకర్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా స‌జ్జ‌ల భార్గ‌వ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం సీఎం జ‌గ‌న్ నిరంత‌రం కృషి చేస్తున్న‌ట్టు చెప్పారు. ప్ర‌జ‌ల‌కు ఒక‌వైపు అనేక సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తూ.. అవినీతిపై ఎడ‌తెగ‌ని పోరాటం చేస్తున్నార‌ని తెలిపారు.

“ప్రజా సంక్షేమమే కాదు. అవినీతి పరుల గుండెల్లో సింహ స్వప్నంగా జగనన్న నిలిచారు. దుష్ట చతుష్టయం నుంచి రాష్ట్రాన్ని కాపాడే జగనన్నకు మనం అందరం అండగా నిలవాలి” అని స‌జ్జ‌ల భార్గ‌వ్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతేకాదు, ఏపీలో గ్రామాలను సీఎం జగనన్న ఎంతో అభివృద్ధి చేశార‌ని ఆయ‌న తెలిపారు. ఈ అభివృద్ధి ఓ రేంజ్‌లో ఉంద‌ని, భారత దేశం వచ్చినప్పుడు దీనిని మీరు చూస్తే ఆశ్చర్య పోతారని భార్గ‌వ్ రెడ్డి వ్యాఖ్యానించారు.

వ‌చ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ నిన‌దించిన వైనాట్ 175ను సాకారం చేసేందుకు అంద‌రూ కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రానున్న రోజుల్లో సోషల్ మీడియాలో ఎలా పని చేయాలో అంద‌రూ క‌లిసి నిర్ణ‌యిద్దామ‌న్నారు. 175/175 టార్గెట్ గా అందరం కలిసి చేద్దామని స‌జ్జ‌ల భార్గ‌వ్ రెడ్డి పిలుపునిచ్చారు. మీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటా అని సోషల్ మీడియా కార్యకర్తలకు అభ‌యం ఇచ్చారు. కాగా, ఈ ఆత్మీయ స‌మావేశానికి బ్రిట‌న్ నలు మూలల నుంచి 450 మందికి పైగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.