రేవంత్ కు తప్పని తిప్పలు

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలనే సంకల్పంతో సాగుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తిప్పలు తప్పడం లేదనే చెప్పాలి. రాష్ట్రంలో పార్టీకి ఏర్పడుతున్న సానుకూల పవనాలను ఓట్లుగా మార్చుకోవడం కోసం రేవంత్ రెడ్డి వ్యూహాల్లో మునిగిపోయారు. పార్టీ విజయం కోసం కసరత్తులు చేస్తున్నారు. కానీ పార్టీలోని ఇతర నేతల నుంచి ఆయనకు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడంతో రేవంత్ టార్గెట్ గా తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు పార్టీని వీడుతున్నారు.

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీలోని కొంతమంది నాయకుల నుంచి ఆయనకు సపోర్ట్ లభించని సంగతి తెలిసిందే. అయినా సవాళ్లను అధిగమిస్తూ కాంగ్రెస్ ను ప్రజలకు చేరువ చేసే ప్రయత్నాలను రేవంత్ సమర్థంగా చేస్తున్నారనే టాక్ ఉంది. కేసీఆర్ ను , బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని రేవంత్ దూసుకెళ్తున్నారనే చెప్పాలి. దీంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ కు సరైన పోటీనిచ్చే పార్టీగా కాంగ్రెస్ మారిందనే విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో టికెట్ల లొల్లి రేవంత్ మెడకు చుట్టుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పీసీసీ కార్యదర్శి విజయ్ కుమార్ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్వాల టికెట్ ను రేవంత్ రూ.10 కోట్లు, అయిదు ఎకరాల భూమికి అమ్ముకున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. మిగతా నియోజకవర్గాల టికెట్లనూ ఇలాగే అమ్ముకున్నారని ఆరోపించారు. దీంతో పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు అనుకూలంగా మారాయనే చెప్పాలి. ఇప్పటికే టికెట్ల కోసం రేవంత్ కోట్లు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. ఇప్పుడికి సొంత పార్టీ నేతలే రేవంత్ పై ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ కు కలిసొచ్చింది.