టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును ఏపీ సర్కారు స్కిల్ డెవలప్‌మెంటు కార్పొరేషన్‌లో రూ.341 కోట్ల అవినీకి పాల్పడ్డారంటూ అరెస్టు చేయడం.. జైల్లో పెట్టడం తెలిసిందే. ఈ క్రమంలో అసలు దీనిని కొట్టి వేయాలంటూ.. చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీనిని హైకోర్టు తోసిపుచ్చింది. ఈ క్రమంలో బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు. దీనిపై అనేక వాయిదాల తర్వాత.. తాజాగా మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది.
అయితే.. అనూహ్యంగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టవద్దని.. చంద్రబాబు తరఫున న్యాయవాదులు హైకోర్టును అభ్యర్థించారు. న్యాయవాదులు హరీష్ సాల్వే కోరడంతో హైకోర్టు ఈ పిటిషన్‌ను ఈ నెల 19కి వాయిదా వేసింది. అయితే.. ఇలా చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఆయన తరఫున న్యాయవాదులే విచారణను వాయిదా వేయాలని కోరడం వెనుక.. మరో కీలకమైన కారణం ఉంది. హైకోర్టు గతంలో తోసిపుచ్చిన క్వాష్ పిటిషన్(అసలు స్కిల్ కేసును తనపై కొట్టి వేయాలని) ప్రస్తుతం సుప్రీంలో విచారణలో ఉంది.
ఈ క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు కనుక.. కేసు పూర్వాపరాలు.. లోతుల్లోకివెళ్లి .. చంద్రబాబుకు అనుకూలంగా అంటే.. అసలు బాబుపై కేసు పెట్టేందుకు వీల్లేదంటూ క్వాష్ పిటిషన్‌పై సానుకూలంగా స్పందిస్తుందని బాబు తరఫు న్యాయవాదులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు.. హైకోర్టులో తాజాగా జరుగుతున్న విచారణను వాయిదా వేయాలని కోరారు.
ఒకవేళ ఇప్పుడు హైకోర్టు బెయిల్ ఇచ్చినా.. సుప్రీంలో క్వాష్ పిటిషన్‌పై సానుకూల తీర్పు వస్తే.. అప్పుడు న్యాయపరమైన వివాదాలు వస్తాయని భావించి.. తాజాగా హైకోర్టులో విచారణను వాయిదా వేయించినట్టు టీడీపీ లీగల్ సెల్ ప్రతినిధులు మీడియాకు తెలిపారు.