తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సంరంభం పెద్ద ఎత్తున ముందుకు సాగుతుండడం.. ప్రధాన పార్టీలు టికెట్లు కేటాయిస్తుండడం.. ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో మరో ప్రధాన పార్టీ తెలుగు దేశం కూడా అభ్యర్థుల ప్రకటనపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. దీంతో ఆయన నేరుగా ఈ కార్యకలాపాలపై దృష్టి పెట్టే అవకాశం లేకుండా పోయింది. దీంతో పార్టీలో గతంలో ఉన్న వేడి ఇప్పుడు కనిపించడం లేదు.
అయితే.. తాజాగా తెలంగాణ టీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ మాత్రం మొత్తం 87 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశామని.. ప్రకటనే తరువాయి అని చెప్పడం గమనార్హం. ఈ జాబితాను చంద్రబాబుకు చూపించి, మార్పులు చేర్పులు ఉంటే చేసి.. వెంటనే ప్రకటిస్తామని కూడా అన్నారు. అయితే.. మరోవైపు ఇంకో వాదన కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. కొన్ని రోజుల కిందట.. ఏపీలో టీడీపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు.
దీంతో తెలంగాణలోనూ జనసేన పొత్తు ఉంటే బాగుంటుందని టీ-తెలంగాణ నాయకులు కోరుతున్నారు. తెలంగాణలో బలమైన మెగా అభిమాన వర్గం ఉంది. అదేసమయంలో పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా యాక్టివ్ కావాలని కోరుకునే సినీ రంగంలోని వారు కూడా ఉన్నారు. దీంతో టీడీపీకి ఆయన మద్దతు ఉంటే.. పార్టీ ఆశించిన మేరకు సీట్లను దక్కించుకోవడం ఖాయమనే చర్చ టీడీపీలో సాగుతోంది. ఇదిలావుంటే, మరో వైపు కీలక నాయకులు పార్టీని వదిలేస్తున్నారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో పవన్ ప్రచారం కూడా టీ-టీడీపీ నాయకులు కోరుకుంటున్నారు. ఇక, టీడీపీ నాయకుడు బాలకృష్ణ ప్రచారం చేయనున్నట్టు సమాచారం. అయినప్పటికీ.. పవన్ తమతో కలిసి వస్తే.. ఈ సారి అనుకున్న విధంగా అసెంబ్లీలో సంఖ్య పెరుగుతుందని టీ-టీడీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పటికైతే.. పవన్ తెలంగాణ ఎన్నికలపై పెదవి విప్పకపోవడం గమనార్హం.