స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిమాండ్ మీద జైలుకు వెళ్లి నెల గడిచిపోయింది. ఆయన అరెస్టు అక్రమమని బయట టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. కానీ బాబు లేని టీడీపీ ఎలా ఉందనే ప్రశ్న ఉత్పన్నమైతే మాత్రం పూర్తిగా పడకేసిందనే సమాధానం వినిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాబు లేకపోవడంతో నాయకులు పార్టీని పట్టించుకోవడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నికల దిశగా పార్టీని ప్రజల్లో ఉండేలా చూసుకోవాల్సిన నాయకులు చేతులెత్తేశారనే టాక్ ఉంది.
చంద్రబాబు అరెస్టు వచ్చే ఎన్నికల్లో పార్టీకి కలిసొస్తుందని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. ఆ సింపతీతో ఎన్నికల్లో గెలవొచ్చనే ఆశలు పెట్టుకున్నారనే చెప్పాలి. కానీ అంతకంటే ముందు ప్రజల్లో ఉండాలనే ఆలోచనే నాయకులు చేయడం లేదనే మాట వినిపిస్తోంది. పార్టీ బలోపేతానికి నాయకులు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడమే అందుకు కారణమని చెప్పాలి. బాబు అరెస్టుకు నిరసనగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లోనూ నియోజకవర్గాల వారీగా టీడీపీ నాయకుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటి నుంచే ఎందుకు.. ఎన్నికలు వచ్చాక చూసుకుందామనే అలసత్వంతో నాయకులు ఉన్నారనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
వయసు మీద పడుతున్నా చంద్రబాబు బయట ఉంటే పార్టీని పరుగులు పెట్టించేవాళ్లనే అభిప్రాయాలు గట్టిగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు లోకేష్ ఎక్కువగా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. సీనియర్ నేతలు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు, కార్యక్రమాల్లో జోరు పెంచేందుకు ముందుకు రావడం లేదనే చెప్పాలి. కేవలం మంగళగిరి, రాజమండ్రికి మాత్రమే ఈ నాయకులు పరిమితమవుతున్నారనే టాక్ ఉంది. జనసేనతో పొత్తు, బాబు అరెస్టు సింపతీ వచ్చే ఎన్నికల్లో కలిసొస్తుందని భావిస్తున్న నాయకులు.. తమ నియోజకవర్గాల్లో మాత్రం పార్టీని పట్టించుకోవడం లేదనేది విశ్లేషకుల మాట. మరోవైపు ఈ సమయంలోనే వైసీపీ అన్ని వ్యవహారాలు చక్కబెడుతూ దూకుడు ప్రదర్శిస్తోందనే చెప్పాలి.