ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా.. తన ప్రాంతానికి సంబంధించి ఏదైనా మేలు జరుగుతుందంటే.. వకల్తా పుచ్చుకోవటానికి ముందుంటారు అందుకు భిన్నంగా.. తన ప్రాంతానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందంటే.. దానికి నో చెప్పేస్తాడు. పార్టీ లైన్ కు లోబడి ఉండాల్సి వస్తే.. మౌనంగా ఉంటారు. ఇలాంటి రూల్స్ మొత్తానికి భిన్నంగా ఏపీ మంత్రి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు వెనుక మర్మం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
క్రిష్ణా జిల్లాకు చెందిన కొడాలి నాని.. ఏపీ రాజధాని అమరావతిగా ఏ మాత్రం ప్రయోజనం లేదని తేల్చేశారు. ఓ పక్క అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంతానికి చెందిన రైతులు 250 రోజులకు పైనే నిరసనలు.. ఆందోళనలు చేస్తున్న వేళ.. పరిపాలనా రాజధానిగా అమరావతి అవసరం ఎందుకు లేదో చెప్పేశారు.
పేదలకు స్థానం లేని రాజధాని అమరావతితో ప్రయోజనం లేదన్నారు. ‘‘ప్రజలకు ఉపయోగం లేని అమరావతిలో చట్టాలు చేసే అసెంబ్లీ ఉండటం కూడా అనవసరమే. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం. ఆ పని కచ్ఛితంగా చేస్తాం’’ అని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏపీ రాజధానిగా మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని జగన్ సర్కారు భావిస్తుంటే.. అందుకు భిన్నంగా.. అమరావతిలో అసలు అసెంబ్లీ కూడా అవసరం లేదని చెప్పటం సంచలనంగా మారింది.
ఇప్పటికే పరిపాలనా రాజధానిగా ఉన్న అమరావతిని విశాఖకు తరలించటంపై గుంటూరు.. క్రిష్ణా జిల్లా వాసులు ఆగ్రహంతో ఉన్నట్లుగా వాదనలు వినిపిస్తున్న వేళ.. వారికి మరింత మంట పుట్టేలా.. అసలు అమరావతిలో రాజధానే ఉండాల్సిన అవసరం లేదని పేర్కొనటం చూస్తే.. మంత్రి కొడాలి ధైర్యం ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ఇక..రమేశ్ ఆసుపత్రి యజమాని డాక్టర్ రమేశ్ ను టీడీపీ అధినేత చంద్రబాబు తన నివాసంలోనే దాచి ఉంచారన్నారు.
తప్పు చేయకపోతే.. డాక్టర్ రమేశ్ ఎందుకు పారిపోతారన్న ఆయన.. ఒక మహిళను ముందుపెట్టి పారిపోవటం దారుణంగా అభివర్ణించారు. ఇటీవల రాజధాని విషయంలో సినీ హీరో రామ్ చేసిన ట్వీట్లు వివాదంగా మారిన నేపథ్యంలో.. అతన్ని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన ఆయన.. బాబు ట్రాప్ లో పడకూడదన్నారు. తమకు ఏ సామాజిక వర్గం మీదా కక్ష సాధించాల్సిన అవసరం లేదనన కొడాలి మాటలు ఎప్పటిలానే సంచలనంగా మారాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates