“మనదే గెలుపు.. ఎవరూ తొందర పడొద్దు.. యాగీ చేయొద్దు” అంటూ.. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. తాజాగా ప్రగతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 51 మందికి ఆయన స్వయంగా బీఫాంలు పంపిణీ చేశారు. మిగిలిన బీఫాంలు కూడా సిద్ధమవుతున్నాయని తెలిపారు. నామినేషన్లకు ఇంకా సమయం ఉందని ఎవరూ ఖంగారు పడాల్సిన అవసరం లేదన్నారు.
అభ్యర్థులు కోపతాపాలు పక్కన పెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. సామరస్య పూర్వకంగాసీట్లను సర్దుబాటు చేసినట్టు వివరించారు. సాంకేతికంగా బీఆర్ ఎస్‌ను దెబ్బకొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ ఎస్ గెలిచి తీరుతుందని ఆయన చెప్పారు. పార్టీలో అసంతృప్తిగా ఉన్న కొందరు నేతలను మచ్చిక చేసుకుంటామన్నారు. చిన్న కార్తకర్త అయినా సరే.. అలిగినట్టు తెలిస్తే.. వారి ఇంటికెళ్లి మాట్లాడాలని నేతలకు సూచించారు.
అహంకారానికి పోయిన జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదని అందుకే పక్కన పెట్టామని కేసీఆర్ చెప్పారు. అహంకారానికిపోతే ప్రతికూల ఫలితాలు వస్తాయని హెచ్చరించారు. ఈ కారణంగానే కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందన్నారు. వేములవాడలో అభ్యర్థిని మార్చాల్సిన అవసరం లేదని, కానీ, న్యాయపరమైన అంశాల కారణంగా మార్పు తప్పలేదని కేసీఆర్ చెప్పారు.
ఎన్నికల సమయం కాబట్టి కొందరికి అసంతృప్తులు, కోపతాపాలు ఉంటాయయని, ఇవి సహజమేనని అన్నారు. అభ్యర్థులకు ఓపిక, సంయమనం ఉండాలని కేసీఆర్ సూచించారు. అనంతరం 51 నియోజకవర్గాలకు సంబంధించిన బీ ఫాంలను సీఎం కేసీఆర్ స్వయంగా అందించారు.