టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానుషంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. తాజాగా మంగళగిరి వచ్చిన పవన్.. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు.
సీనియర్ నాయకుడు, ఈ దేశంలోనే ఎన్నదగిన నేత అయిన చంద్రబాబును ఓ రోడ్ సైడ్ వ్యక్తిగా ట్రీట్ చేస్తుండడం దారుణమని పవన్ వ్యాఖ్యానించారు. ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్లు దాచిపెడుతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానవీయంగా ఉందన్నారు. నాయకులు, పోలీసులు ఒక్కటిగా మారి వ్యాఖ్యలు చేస్తున్నారనే సందేహాలు కూడా సాధారణ ప్రజల్లో కనిపిస్తోందని తెలిపారు.
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబు ఆరోగ్య స్థితిగతుల విషయంలో నిర్లక్ష్యం తగదని వైసీపీ సర్కారుకు పవన్ సూచించారు. కనీసం చంద్రబాబు వయసునైనా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. చంద్రబాబు జైలు గదిలో ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన సమస్యలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. బాబు ఆరోగ్యం విషయంలో రాజకీయ కక్ష సాధింపు ధోరణి సరికాదని వైసీపీ సర్కారుకు హితవు పలికారు.
బాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యుల ఆవేదనను వైసీపీ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా చులకనగా చూస్తున్నారని, వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని, ఇది వైసీపీ వైఖరిని ప్రతిబింబిస్తోందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. బాబు ఆరోగ్యంపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కోర్టులు జోక్యం చేసుకొని విచారణ చేపట్టాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఏం జరిగినా అది ప్రభుత్వ బాధ్యతేనని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates