వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసింది కాంగ్రెస్. అలాగే అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎదురు దెబ్బలు తప్పలేదు. రోజు రోజుకూ ఆ పార్టీ ప్రాభవం తగ్గిపోతోంది. వచ్చే ఎన్నికల నాటికి కూడా పార్టీ పుంజుకుంటుందన్న ఆశలేమీ కనిపించడం లేదు.
ఇందుకు ప్రధాన కారణం.. ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ సమర్థతను చాటుకోలేకపోవడం. విషయ పరిజ్ఞానం, వాక్చాతుర్యం, ప్రజాదరణ.. ఇలా ఏ కోణంలో చూసినా నరేంద్ర మోడీ ముందు రాహుల్ తేలిపోతున్నాడు. వయసు మీద పడి, ఆరోగ్యం దెబ్బ తిని, రాజకీయంగా ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ వ్యవహారాల్ని నడపలేక సోనియా గాంధీ ఇబ్బంది పడుతుంటే.. ఆమె స్థానాన్ని భర్తీ చేయడానికి రాహుల్ ముందుకు రావట్లేదు. తనకు అధ్యక్ష పదవి వద్దంటూ అస్త్రసన్యాసం చేశాడు. మరోవైపు రాహుల్ మీద నమ్మకం లేక అతణ్ని వ్యతిరేకించే వాళ్లూ పార్టీలో లేకపోలేదు.
ఐతే మొన్నటి సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు మరోసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి గురించి చాలా చర్చ జరిగింది. సోనియా పదవి నుంచి తప్పుకోబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఆమె స్థానాన్ని మన్మోహన్ సింగ్, ఆంటోనీ లాంటి సీనియర్ నేతల్లో ఒకరు భర్తీ చేయొచ్చని ప్రచారం జరిగింది. కానీ పార్టీలో భజన బృందం అంతా ఒక్కటై మళ్లీ సోనియానే పదవిని చేపట్టేలా మంత్రాంగం నడిపారు. ఆమెను ఒప్పించారు.
కొందరేమో రాహుల్ కావాలన్నారు. ఐతే కాంగ్రెస్ పార్టీలో ఈ వ్యవహారంపై గొడవ నడుస్తుండగా.. బీజేపీ శ్రేణులు దీన్ని బాగా ఎంజాయ్ చేశాయి. సోషల్ మీడియాలో బీజేపీ మద్దతుదారులు ఒక ఆసక్తికర హ్యాష్ ట్యాగ్‌తో సందడి చేస్తున్నారు రెండు రోజులుగా. #BJPWITHRAGA ఈ హ్యాష్ ట్యాగ్‌తో వాళ్లు సందడి చేస్తున్నారు.
బీజేపీని గత రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలిపించింది రాహులే అని, ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తే 2024లోనూ మోడీనే గెలుస్తాడని.. అందుకే తమ మద్దతు పూర్తిగా రాహుల్‌కే అని అతడి అసమర్థత మీద సెటైరిగ్గా పోస్టులు పెడుతున్నారు. మీ పార్టీ అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాకు మద్దతు ఇవ్వండి అని రాహుల్ బీజేపీ వాళ్లను అడుగుతున్నట్లు. ఇంకా పలు రకాలుగా మీమ్స్ తయారు చేసి ట్విట్టర్లో పోెస్ట్ చేయడం విశేషం.