డే-2.. 47 ప్ర‌శ్న‌లు.. నా టైం వేస్ట్‌: నారా లోకేష్

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్ ఎలైన్ మెంట్‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయంటూ.. టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్‌పై కేసు న‌మోదు చేసిన ఏపీ సీఐడీ అధికారులు ఆయ‌న‌ను విచారిస్తున్న విష‌యం తెలిసిందే. వాస్త‌వానికి ఒక్క రోజు విచార ణ‌కు హైకోర్టు అనుమ‌తించినా.. అధికారులు మాత్రం వ‌రుస‌గా రెండో రోజు కూడా నారా లోకేష్‌ను విచారించారు. అయితే, రెండో రోజైన బుధ‌వారం కూడా ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల‌కు సుమారు 6 గంట‌ల‌కు పైగా త‌న‌ను విచారించినా.. ఎలాంటి లాభం లేద‌ని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

“రెండో రోజు విచార‌ణ‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. కానీ, వ్య‌వ‌స్థ‌ల‌పై ఉన్న గౌర‌వంతో వెళ్లాను. హైకోర్టు కేవ‌లం ఒక్క‌రోజుకే అనుమ‌తి ఇచ్చింది. అయినా.. అధికారులు రెండో రోజు కూడా ర‌మ్మ‌ని నోటీసులు ఇచ్చారు. రెండో రోజు ఏకంగా 47 ప్ర‌శ్న‌లు అడిగారు. కానీ, దీనిలో కూడా ఇన్న‌ర్ రింగ్ రోడ్‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లు లేవు. హెరిటేజ్ పెట్టుబ‌డులు, మా అమ్మ భువ‌నేశ్వ‌రి ఐటీ రిట‌ర్న్స్ వంటి అంశాల‌నే ప్ర‌స్తావించారు. వాటిపై నాకు అవ‌గాహ‌న ఎలా ఉంటుంది? అందుకే ఆ విష‌యాల‌ను ఆడిట‌ర్‌నే అడ‌గ‌మ‌ని చెప్పాను. మొత్తానికి నా టైం వేస్ట్ చేశారు” అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

ఇక‌, రెండో రోజు సీఐడీ అధికారులు నారా లోకేష్‌ను విచారించిన‌ప్ప‌టికీ.. ఇత‌మిత్థంగా ఇన్న‌ర్ రింగ్ రోడ్ అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించిన ఆధారాల‌ను ఆయ‌న ముందు పెట్ట‌లేద‌ని తెలిసింది. కేవ‌లం విచార‌ణ పేరుతో ఆరు గంట‌ల పాటు త‌మ ముందు కూర్చోబెట్టుకున్నార‌ని టీడీపీ నాయ‌కులు విమ‌ర్శించారు.

విచార‌ణ అనంత‌రం నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. “ఇన్నర్‌ రోడ్ కేసు ఆధారాలు ఎక్కడా చూపెట్టడం లేదు. అజేయ కల్లాంరెడ్డి, ప్రేమ్‌చంద్రారెడ్డిపై ఎఫ్ ఐఆర్‌ ఎందుకు న‌మోదు చేయ‌లేదు?. అజేయ కల్లాం, ప్రేమ్‌చంద్రారెడ్డిని ఎందుకు విచారించలేదు?. భువనేశ్వరి ఐటీ రిటర్న్స్‌ ఆడిటర్‌ను అడగమని చెప్పా. మేం ఉంటున్న లింగ‌మ‌నేని ఎస్టేట్‌కు రెంట్ చెల్లిస్తే క్విడ్‌ ప్రోకో ఎలా అవుతుంది?” అని నారా లోకేష్ ప్ర‌శ్నించారు.