‘చంద్ర‌బాబు ఉన్న‌ది ప్ర‌కృతి వ‌నంలో కాదు.. జైల్లో’

టీడీపీ అధినేత, మాజీ మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌స్తుతం రాజ‌మండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న విష‌యం తెలిసిందే. గ‌త 30 రోజుల‌కు పైగానే ఆయ‌న జైల్లో ఉండ‌డం, స‌రైన వెంటిలేష‌న్ లేక‌పోవ‌డం(టీడీపీ నేత‌ల ఆరోప‌ణ‌), బ‌య‌టి ఉష్ణోగ్ర‌త‌లు పెర‌గ‌డం, జైలు గ‌దిలో చంద్ర‌బాబుకు ఏసీ సౌక‌ర్యాన్ని క‌ల్పించ‌క‌పోవడం వంటి కార‌ణాల‌తో మంగ‌ళ‌వారం సాయంత్రం త‌ర్వాత చంద్ర‌బాబు స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని స్వ‌యంగా జైలు అధికారులే తెలిపారు.

డీహైడ్రేష‌న్‌కు గురైన చంద్ర‌బాబుకు వైద్య సేవ‌లు అందించేందుకు వెంట‌నే సంబంధిత వైద్యుల‌కు కూడా స‌మాచారం అందించారు. అయితే, చంద్ర‌బాబు స్వ‌ల్ప అనారోగ్యంపై వైసీపీ నాయ‌కుడు, మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ తీవ్రంగా స్పందించారు. చంద్ర‌బాబు ఆరోగ్యంపై సెటైర్లు వేశారు.

“చంద్ర‌బాబు ఉన్న‌ది ప్ర‌కృతి వ‌నంలో కాదు.. జైల్లో అన్న సంగ‌తిని ఆయ‌న మ‌రిచిపోయారు” అని మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. జైల్లో ఉన్న చంద్ర‌బాబు సింప‌తీ కోసం అనారోగ్యం అంటూ త‌న అనుకూల మీడియా ద్వారా ప్ర‌చారం చేయించుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు.

అయితే, మంత్రి గుడివాడ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. మాజీ ముఖ్యమంత్రిని ఆధారాలు కనిపెట్టక ముందే జైల్లో అక్ర‌మంగా నిర్బంధించ‌డ‌మే కాకుండా.. చంద్ర‌బాబు అనారోగ్యంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం ఏంట‌ని నిల‌దీశారు.