సీఎం జగన్ పై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైలవరంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కళ్లకు గంతలు కట్టుకొని చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఉమ….జగన్ పై విమర్శలు గుప్పించారు. 151 సీట్ల అధికార మదం, రెండున్నర లక్షల కోట్ల ధన మదం కలగలిసిన జగన్ ఎగతాళిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డీ…మిడిసిపడమాకు త్వరలో ప్రజలు ఓటు అనే ఆయుధంతో గద్దె దించుతారని జోస్యం చెప్పారు.
ప్రజాధనాన్ని లాయర్లకు ఇచ్చి చంద్రబాబును జైల్లోనే ఎక్కువ కాలం ఉంచాలని జగన్ కుట్ర పన్నుతున్నాడని విమర్శించారు. జగన్ మాటల్లో అహంకారం కనబడుతోందని..చివరకు ధర్మం, న్యాయం గెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ముందస్తు ఎన్నికల కోసం మూడ్రోజుల పాటు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసం జగన్ పడిగాపులు కాసినా ఫలితం లేకపోయిందని ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల పున:పంపిణీపై ప్రధాని మోడీకి వినతిపత్రం ఇవ్వలేకపోయిన చేతగాని, అసమర్ధుడు జగన్ అని ఎద్దేవా చేశారు.
మరోవైపు, చంద్రబాబుతో జైల్లో ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ములాఖత్ అయిన అనంతరం జగన్ పై నిప్పులు చెరిగారు. ప్రత్యర్థులు చంద్రబాబును మానసికంగా, రాజకీయంగా దెబ్బతీయాలనుకున్నా ఆయన మానసికంగా మరింత దృఢంగా తయారయ్యారని పయ్యావుల అన్నారు. ప్రతి మాటా రాష్ట్రం కోసమే చంద్రబాబు మాట్లాడారని, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూన్నారని పయ్యావుల అన్నారు.
పార్టీకి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాట పంథాను వీడొద్దండీ అని చంద్రబాబు తనతో అన్నారని చెప్పారు. తన గురించి, తన కేసుల గురించి మాట్లాడలేదని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. చంద్రబాబును చూడగానే కొద్దిసేపు బాధ కలిగినా, ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని చూశాక ధైర్యం వచ్చిందని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates