తెలంగాణతోపాటు 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారని పుకార్లు వస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో అమిత్ షాతో ముందస్తు ఎన్నికలపైనే జగన్ మాట్లాడారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ పుకార్లపై సీఎం జగన్ క్లారిటీనిచ్చారు. 2024 మార్చిలో ఏపీ శాసనసభ ఎన్నికలు జరుగుతాయని జగన్ తేల్చి చెప్పేశారు. ఫిబ్రవరిలో వైసీపీ మేనిఫెస్టో ప్రకటిస్తామని, మార్చి నెలలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవ్వాలని వైసీపీ నేతలకు, కార్యకర్తలకు జగన్ పిలుపునిచ్చారు.
విజయవాడలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన జగన్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని అన్నారు. అక్టోబరు 25 నుంచి డిసెంబర్ 21 వరకు బస్సు యాత్ర చేపట్టబోతున్నానని జగన్ ప్రకటించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో బస్సు యాత్రలు కొనసాగుతాయని, ప్రతిరోజు మూడు సమావేశాలు ఉంటాయని వెల్లడించారు. బస్సు యాత్ర బృందంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నేతలుంటారని అన్నారు. ఇది కేవలం బస్సు యాత్ర కాదని సామాజిక న్యాయ యాత్ర అని జగన్ చెప్పారు. తన ప్రభుత్వంలో ప్రజలకు, పేదవారికి జరిగిన మంచిని వివరించేందుకే ఈ యాత్ర చేపడుతున్నామని అన్నారు.
మూడు ప్రాంతాల ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేలా మూడు రాజధానులను రూపొందిస్తామని జగన్ చెప్పారు. మేనిఫెస్టోని 99% హామీలను అమలు చేశామని, గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని జగన్ అన్నారు. ఏపీకి జగన్ ఎందుకు రావాలో చెప్పేందుకే ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. కోటి 60 లక్షల మంది ఇళ్లకు వెళ్లే విధంగా కార్యక్రమం రూపొందించామన్నారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం చేపడతామని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates