2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఐదు రాష్ట్రాలలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. 2024 ఫైనల్ ఎలక్షన్ కు ఈ ఐదు రాష్ట్రాల ఎలక్షన్లు సెమీ ఫైనల్ గా కేంద్రంలోని బీజేపీ భావిస్తోంది. ఇక, జమిలి ఎన్నికల ప్రక్రియ రాబోయే ఏడాదికి సాధ్యం కాకపోవడంతో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ ను ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల విడుదల చేసింది.
తెలంగాణతో పాటు రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ఎన్నికల షెడ్యూల్ ను సిఇసి రాజీవ్ కుమార్ వెల్లడించారు. తెలంగాణలో నవంబర్ 30న శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసేందుకు నవంబరు 3వ తారీఖున నోటిఫికేషన్ వెలువడనుంది. నవంబరు 10వ తేదీన నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. నామినేషన్ల పరిశీలనకు 13 నవంబర్ వరకు గడువు ఉంది. 15 నవంబర్ లోపు అభ్యర్థులు నామినేషన్లు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది. డిసెంబర్ 5వ తేదీ లోపు కౌంటింగ్ పూర్తి చేయాలని నోటిఫికేషన్లో వెల్లడించారు.
మిజోరంలో నవంబర్ 7న ఒక దశలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఛత్తీస్ గఢ్ లో 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ తేదీ నవంబర్ 7న, 17న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి. మధ్యప్రదేశ్లో నవంబర్ 17న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు రానున్నాయి. రాజస్థాన్ లో నవంబర్ 23న పోలింగ్, డిసెంబర్ 3న ఫలితాలు రానున్నాయి. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్…మధ్యప్రదేశ్‌లో బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates