బాబు అరెస్టు బాధాక‌రం.. వ్య‌క్తిగ‌తంగా న‌న్ను క‌ల‌చివేస్తోంది

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు విష‌యంలో మ‌రో తెలంగాణ మంత్రి గొంతు ఎత్తారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు స‌న్నిహితుడ‌నే ముద్ర ఉన్న తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ, ప‌శుసంవ‌ర్థ‌క శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజాగా ఈ విష‌యంలో రియాక్ట‌య్యారు. చంద్ర‌బాబు అరెస్ట్ చాలా బాధాకరమ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సుమారు 73 సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం, విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాద‌ని త‌ల‌సాని అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ టీడీపీ నేత‌గా ఉన్న‌ప్పుడు మ‌రియు ఉమ్మ‌డి రాష్ట్రంలో ప‌నిచేసిన నాటి సంఘ‌ట‌న‌ల‌ను గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని త‌ల‌సాని తెలిపారు. చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేశానని పేర్కొంటూ బాబు అరెస్టు వ్యక్తిగతంగా తనకెంతో బాధను కలగచేసిందని త‌ల‌సాని అభిప్రాయ‌ప‌డ్డారు. అధికారం శాశ్వతం కాదు అని హిత‌వు ప‌లికి త‌ల‌సాని ఒకప్పుడు కేంద్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నాయకుడు అయిన‌ చంద్రబాబు పట్ల ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరమ‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

కాగా, ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అరెస్టు ప‌ట్ల ఇప్ప‌టికే ప‌లువురు బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేత‌లు విచారం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు, మంత్రి హరీశ్ రావు తో పాటుగా మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, పువ్వాడ అజ‌య్‌, స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి , పార్టీ ఎమ్మెల్యేలు చంద్ర‌బాబు అరెస్టు ప‌ట్ల విచారం వ్య‌క్తం చేశారు.