పవన్ కు పోలీసుల నోటీసులు

కృష్ణాజిల్లా పెడనలో బుధవారం జరగనున్న జనసేన బహిరంగ సభలో రాళ్ల దాడి జరిగే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. రెండు మూడు వేల మంది వైసీపీ గూండాలు, క్రిమినల్స్ పెడన సభలోకి చొరబడి రాళ్లు, కత్తులతో దాడి చేసే ఛాన్స్ ఉందని పవన్ సంచలన ఆరోపణలు చేశారు. రేపు ఏం జరిగినా సీఎం జగన్, రాష్ట్ర డిజిపి, రాష్ట్ర హోంమంత్రి బాధ్యత వహించాలని పవన్ చేసిన కామెంట్లు కాక రేపాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏ సమాచారం, ఆధారాలతో ఆ ఆరోపణలు చేశారో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

పవన్ దగ్గర ఉన్న ఆధారాలు తమకు ఇవ్వాలని కోరారు. కానీ, పోలీసుల నోటీసులకు పవన్ కళ్యాణ్, జనసేన నేతలు సమాధానం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా షాకింగ్ కామెంట్స్ చేశారు. సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని, బాధ్యతారహితంగా ఆరోపణలు చేస్తే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. పవన్ సభకు సరిపడా బందోబస్తు చేశామని, ఆ ఆరోపణలు చేసిన పవన్ తాము ఇచ్చిన నోటీసులపై ఇంతవరకు స్పందించలేదని అన్నారు. పవన్ వ్యాఖ్యలపై తాము పూర్తి విచారణ చేశామనిచ, ఆ ప్రాంతాన్ని పరిశీలించామని చెప్పారు.

పవన్ పై దాడి జరుగుతుందని ఆయనకు ఎలా తెలుసని జాషువా ప్రశ్నించారు. నోటీసులకు రిప్లై రాలేదని, దానిని బట్టి పవన్ వి నిరాధారమైన ఆరోపణలు అని అనుకోవాలా..? అంటూ ప్రశ్నించారు. పోలీసులకు సమాచార వ్యవస్ధ ఉందని, స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో జల్లెడ పడుతున్నామని, కానీ అటువంటి అనుమానాస్పద విషయాలేమీ తమ దృష్టికి రాలేదని తెలిపారు. రెచ్చగొట్టే భాష, సైగలు, లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగించే అంశాలుగా వాడడం మానుకోవాలని పవన్ కు సూచించారు. ప్రముఖ వ్యక్తులు, పోలీసు శాఖ, ఉన్నతాధికారుల మీద వ్యాఖ్యలు చేస్తే రికార్డు చేసి పరిశీలిస్తామని, రాజకీయ పార్టీలు ఇటువంటి ఆరోపణలు చేయద్దని అన్నారు.