సాధారణంగా పత్రికలకు ఉన్న సర్క్యులేషన్ ను బట్టి ప్రభుత్వం ప్రకటనలిస్తుంటుంది. ఇక, ఆయా పత్రికల సర్క్యులేషన్ తో పాటు పాపులారిటీని బట్టి, డీలింగ్స్ ను బట్టి పలు ప్రైవేటు సంస్థలు, కార్పొరేటు కంపెనీలు ప్రకటనలు ఇస్తుంటాయి. వీటిలో ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనలు దాదాపుగా అన్ని ప్రధాన పత్రికలకు సమానంగా ఇవ్వాలి.
అయితే, అధికార పార్టీకి అనుకూలంగా ఉండే పత్రికలకు ఇచ్చే ప్రభుత్వ ప్రకటనల శాతం…మిగతా పత్రికల కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుందనే ఆరోపణలున్నాయి. అయితే, ప్రస్తుతం ఏపీలో అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఆ శాతాన్ని విచ్చలవిడిగా పెంచేసిందని తాజాగా ఆర్టీఐ ద్వారా వెల్లడైంది.
సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి పత్రికకు 52 శాతం ప్రకటనలు వెళ్లాయని సమాచార హక్కు చట్టం ద్వారా విజయవాడకు చెందిన శ్రవణ్ వెల్లడించారు. ఏపీ, తెలంగాణలో మరో ప్రముఖ దినపత్రిక అయిన ఆంధ్రజ్యోతికి కేవలం 0.25 శాతం ప్రకటనలే ప్రభుత్వం ఇచ్చిందని ఆర్టీఐ ఇచ్చిన సమాచారంలో వెల్లడైందని ఆయన తెలిపారు.
గత ఏడాది మే నెలలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో, 2019 మే నెల నుంచి 2020 మే వరకూ అన్ని పత్రికలకు ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల వివరాలు తెలపాలంటూ విజయవాడకు చెందిన కె. నాగ శ్రావణ్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు.
దీనికి సంబంధిత శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ 12 నెలల కాలంలో ప్రభుత్వం పత్రికల్లో ప్రకటనల కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు ఖర్చుపెట్టింది. ఆ 100 కోట్లలో జగన్ కుటుంబానికి చెందిన సాక్షి పత్రికకు రూ.52 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చారు.
ఇరు తెలుగు రాష్ట్రాల్లోని మరో ప్రధాన పత్రిక ‘ఈనాడు’కు రూ.39 కోట్ల విలువైప ప్రకటనలు ఇచ్చారు. ఇక, మరో ప్రధాన పత్రిక‘ఆంధ్రజ్యోతి’కి మాత్రం కేవలం రూ.25 లక్షల విలువైన ప్రకటనలు మాత్రమే ఇచ్చింది జగన్ సర్కార్.
ఇక, మిగతా చిన్నా చితకా పత్రికలకూ ఆంధ్రజ్యోతికంటే అధికంగానే ప్రకటనలు ఇచ్చింది జగన్ సర్కార. ప్రజాశక్తి రూ.2.98కోట్లు, విశాలాంధ్ర రూ.1.87 కోట్లు, ఆంధ్రప్రభ రూ.2.15 కోట్లు, ఆంధ్రభూమి రూ.50 లక్షలు, వార్త రూ.1.35 కోట్లు విలువైన ప్రకటనలు దక్కించుకున్నాయి.
ఇక, టీవీ చానళ్లకు ఇచ్చిన ప్రకటనల వివరాలను సంబంధిత శాఖ వెల్లడించలేదు. ప్రజాధనంతో ఇచ్చే ప్రకటనల విషయంలో ప్రభుత్వం పక్షపాతం చూపుతోందని ఆర్‌టీఐ ఉద్యమకారుడు శ్రవణ్ ఆరోపించారు. సర్క్యులేషన్ పరంగా మొదటి స్ధానంలో లేని సాక్షి పత్రికకు సింహభాగం ప్రకటనలిచ్చారని శ్రవణ్ ఆరోపించారు.
ప్రధాన పత్రికల్లో ఒకటైన ఆంధ్రజ్యోతికి ఒక శాతం ప్రకటనలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. విమర్శనాత్మకంగా ఉండే పత్రికలను ప్రభుత్వం శిక్షిస్తోందనడానికి ఇది నిదర్శనమన్నారు. మరి, ఈ విషయంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates