అధికారం దగ్గరకు వచ్చేస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్ధుల ఎంపిక విషయంలో సీరియస్ దృష్టిపెట్టాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఒకపుడు రాష్ట్రంలో పర్యటించటంతో పాటు నియోజకవర్గాల సమీక్షలు చేస్తు కొందరు అభ్యర్ధులను ఫైనల్ చేశారు. గడచిన 24 రోజులుగా ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇదే సమయంలో వైసీపీలో క్యాండిడేట్లను ఫైనల్ చేసే ప్రక్రియ మొదలైంది. పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాయలసీమ జిల్లాల పర్యటన మొదలుపెట్టారు.
ఎంపీ మొదటి తన పర్యటనను తిరుపతి జిల్లాతో మొదలుపెట్టారు. రెండురోజుల పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమీక్షలు జరిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏమిటి ? ఎంఎల్ఏల పనితీరుపై అభిప్రాయాలు సేకరించారు. రాబోయే ఎన్నికల్లో ఎంఎల్ఏ అభ్యర్ధిగా ఎవరైతే బాగుంటుందనే విషయాన్ని కూడా ఆరాతీశారు. ఈ రెండురోజుల సమావేశాల్లో నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఫైనల్ చేశారు. అవేమిటంటే తిరుపతి నుండి భూమన అభినయ్ రెడ్డి, శ్రీకాళహస్తి నుండి బియ్యపు మధుసూధనరెడ్డి, చంద్రగిరి నుండి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వెంకటగిరి నుండి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పోటీ ఖాయమైపోయింది.
తిరుపతి ఎంఎల్ఏ భూమన కరుణాకరరెడ్డి రాబోయే ఎన్నికల్లో పోటీచేయటంలేదని గతంలోనే ప్రకటించేశారు. అందుకనే ఇపుడు అభినయ్ అనధికారిక ఎంఎల్ఏగా చెలామణి అవుతున్నారు. ఇక చంద్రగిరిలో కూడా చెవిరెడ్డి భాస్కరరెడ్డికి బదులు కొడుకు మోహిత్ పోటీ చేస్తారని ఎంపి ప్రకటించారు. ఇప్పటికే మోహిత్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ఇక శ్రీకాళహస్తిలో ఎంఎల్ఏ బియ్యపే మళ్ళీ పోటీచేయబోతున్నారు. వెంకటగిరిలో నేదురుమల్లి పోటీచేయటం ఖాయమైపోయింది. వీళ్ళనలుగురి గెలుపుకు నేతలు, క్యాడర్ అంతా కష్టపడాలని విజయసాయిరెడ్డి ప్రకటించేశారు. మిగిలిన గూడూరు, సత్యవేడు, సూళ్ళూరుపేట ఎంఎల్ఏలు వరప్రసాద్, కలివేటి సంజీవయ్య, కోనేటి ఆదిమూలంపై బాగా ఆరోపణలొచ్చాయి. సిట్టింగులకు మళ్ళీ టికెట్లిస్తే పార్టీకి ఇబ్బందులు తప్పవని నేతలు, క్యాడర్ స్పష్టంగా చెప్పేశారట. అంటే వీళ్ళ ముగ్గురి వైఖరిపై బాగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని సమాచారం. అందుకనే ఈ మూడింటిపైన జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని ఎంపీ ప్రకటించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates