రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన పార్టీల సంయుక్త ప్రభుత్వం ఏర్పడుతుందని… జనసేన పార్టీ (జెఎస్‌పి) అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. వారాహి యాత్ర నాలుగో విడత యాత్ర లో భాగంగా ఆదివారం అవనిగడ్డలో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ 2024లో జరిగే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) ఓటమి ఖాయమని అన్నారు.
టీడీపీతో పొత్తు పెట్టుకుని జేఎస్పీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ తొలి బహిరంగ సభ ఇదే. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడును కలిసిన తర్వాత బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న కళ్యాణ్ ఈ విషయాన్ని బీజేపీ పెద్దలతో ఎలాంటి బహిరంగ సమావేశం జరపకుండానే పవన్ టీడీపీతో పొత్తును ప్రకటించారు. బీజేపీ కూడా తమతో జతకడుతుందని ఆశించారు. కానీ ఇప్పటికీ బీజేపీ తన నిర్ణయాన్ని వెల్లడించలేదు.
ఇక తాజా ప్రసంగంలో పవన్ మాట్లాడుతూ ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందాలన్న వైఎస్సార్‌సీపీ లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ, 15 సీట్లకు మించి వైసీపీ గెలవదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తనకు డబ్బు మరియు భూమిపై ఎప్పుడూ ఆసక్తి లేదని అన్నారు. నైతిక ధైర్యంతో రాష్ట్ర భవిష్యత్తు ద్రుష్టిలో ఉంచుకుని జగన్ మోహన్ రెడ్డిపై పోరాడుతున్నానని పేర్కొన్నారు.
గత 10 ఏళ్లలో తమ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను చవిచూసిందని, విలువల కోసమే పార్టీని నడుపుతున్నానని పవన్ అన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి లేదా అంతకంటే పెద్ద పదవి వచ్చినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే తనకు అధికారం కోసం ఆత్రుత లేదని, ప్రజల అభ్యున్నతి కోసం, రాష్ట్ర మంచి భవిష్యత్తు కోసం కృషి చేయాలని ఉందని ఆయన స్పష్టం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates