మేనమామకు టికెట్ ఇస్తే.. రంగంలోకి హీరో నితిన్

హీరో నితిన్ రాజకీయ ప్రచారం చేసే అవకాశముందా? కాంగ్రెస్ కు ఓట్లు వేయమని ఆయన ప్రజలను అడుగుతారా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే చెబుతున్నారు. నితిన్ మేనమామ నగేష్ రెడ్డికి వచ్చే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇచ్చే అవకాశం ఉండటమే అందుకు కారణమని చెప్పాలి. నగేష్ రెడ్డి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా పదేళ్లకు పైగా పని చేశారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ ను నగేష్ రెడ్డి కోరుతున్నారు. ఇటీవల ఈ విషయంపై ఆయన రేవంత్ రెడ్డిని కలిశారని తెలిసింది. పైగా తనకు టికెట్ ఇస్తే తన మేనళ్లుడు హీరో నితిన్ తో ప్రచారం చేయిస్తానని కూడా నగేష్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ ఆలోచనలో పడ్టట్లు టాక్ వినిపిస్తోంది. నిజామాబాద్ రూరల్ టికెట్ ను నగేష్ రెడ్డికి ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన భూపతి రెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. దీంతో ఈ స్థానంపై కాంగ్రెస్ పునరాలోచనలో పడ్డట్లు తెలిసింది. నగేష్ రెడ్డికి టికెట్ ఇస్తే రెండు రకాలుగా పార్టీకి కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు టాక్. నితిన్ ఎన్నికల ప్రచారానికి వస్తే పార్టీకి కలిసొస్తుందనే ఆలోచనలో కాంగ్రెస్ ఉందని సమాచారం.