రాహుల్ వెర్సస్ సీనియర్లు.. సీడబ్ల్యూసీ మీటింగ్‌ హాట్ హాట్

కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పు విషయమై నెలకొన్న అంతర్గత సంక్షోభం తీవ్ర స్థాయికి చేరినట్లే కనిపిస్తోంది. రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని విడిచిపెట్టడానికి సోనియా గాంధీ సిద్ధమవుతుండగా.. ఆ పదవిని చేపట్టేందుకు రాహుల్ సుముఖంగా లేని విషయం తెలిసిందే.

రాహుల్‌కు పగ్గాలప్పగించే విషయంలో పార్టీలోనూ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పార్టీలో ప్రక్షాళన అవసరమని పేర్కొంటూ.. రాహుల్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీలో 23 మంది సీనియర్ నేతలు ఇటీవల అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాయడంపై సోమవారం నాటి సీడబ్ల్యూసీ సమావేశం‌లో హాట్ హాట్ చర్చ జరిగింది. ఓవైపు తనకు అధ్యక్ష పదవి వద్దంటూనే.. తన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాసిన సీనియర్లపై రాహుల్ గాంధీ మండిపడ్డారు.

మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాజకీయాలు క్లిష్టతరంగా ఉన్న సందర్భంలో.. సోనియా ఆరోగ్యం కూడా బాగా లేని పరిస్థితుల్లో సీనియర్లు ఈ లేఖను ఆమెకు ఎందుకు పంపించారని రాహుల్ నిలదీశారు. అసమ్మతి సభ్యులు బీజేపీతో చేతులు కలిపారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో లేఖలు రాయడం భావ్యమా అని ప్రశ్నించారు. ఐతే రాహుల్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా సమావేశంలో కలకలం రేగింది. సీనియర్ నేతలు కపిల్ సిబల్, గులాంనబీ ఆజాద్ రాహుల్‌కు దీటుగా సమాధానం ఇచ్చారు.

‘‘మీరు ఆరోపించినట్లు ఒకవేళ నేను బీజేపీ ఏజెంట్‌నే అయితే… ఇప్పుడే వెంటనే రాజీనామా చేసేసి బయటికి వెళ్లిపోతాను’’ అని ఆజాద్ రాహుల్ గాంధీతో పేర్కొనడం గమనార్హం. తాము లేఖ రాయడానికి సీడబ్ల్యూసీ సభ్యుల వ్యవహార శైలే కారణమని ఆజాద్ స్పష్టం చేశారు.

మరోవైపు తమపై చేసిన ఆరోపణలపై కపిల్ సిబాల్ కూడా మండిపడ్డారు. సీడబ్ల్యూసీ సమావేశంలోనే కాక ఆయన ట్విట్టర్లో కూడా రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘మేం బీజేపీతో కుమ్మక్కయ్యామంటారా? రాజస్థాన్ హైకోర్టులో విజయవంతంగా వాదించి కాంగ్రెస్‌ను నిలబెట్టింది ఎవరు?మణిపూర్‌లో బీజేపీని దించి కాంగ్రెస్‌ను కాపాడిందెవరు? గత 30 ఏళ్లలో బీజేపీకి అనుకూలంగా ఒక్క ప్రకటనైనా చేయడం చూశారా? అలాంటిది… మమ్మల్నేబీజేపీతో కుమ్మక్కయ్యారంటారా?’’ అంటూ సిబల్ ట్విట్టర్లో రాహుల్ మీద మండిపడ్డారు. ఈ పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం తీవ్ర స్థాయికి చేరేట్లే కనిపిస్తోంది.