కరోనా కలకలం కొనసాగుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న ప్రజలకు గుడ్ న్యూస్. కీలక సమయంలో కేంద్రం తీపికబురు తెలిపింది. లాక్ డౌన్ విముక్తి అయిపోయి అన్‌లాక్ దశలు ఒకదాని వెంట ఒకటి వస్తున్నా… ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్తున్న ప్రజలకు కొనసాగుతున్న కష్టాలకు చెక్ పడింది. అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు ఉండకూడదని కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
అంతరాష్ట్ర రవాణ విషయంలో కీలక వివరాలు వెల్లడిస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేడు ఆదేశాలు వెలువరించారు. దేశంలో ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలంటే ఎలాంటి ఆంక్షలు లేకుండా వెళ్లేందుకు ఎలాంటి షరతులు విధించవద్దని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో ఆయన స్పష్టం చేశారు. అంతరాష్ట్ర రవాణ ఆంక్షలతో ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధిపై ప్రభావం పడుతోందని అందుకే తాజా ఆదేశాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి పేర్కొన్నారు. వ్యక్తులు, వస్తువుల రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని లేఖలో స్పష్టం చేసిన అజయ్ భల్లా ఆంక్షలు విధిస్తే నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తోందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, కరోనా మహమ్మారి వల్ల విధించిన లాక్‌డౌన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలోనే వివిధ ప్రాంతాల్లో ఇరుక్కుపోయారు. క్రమంగా సడలింపులు వచ్చినప్పటికీ ఒక ప్రాంతం వరకు, ఒక రాష్ట్రం వరకు మాత్రం ఇబ్బంది లేదు. అయితే, రాష్ట్రాల సరిహద్దుల విషయంలో సమస్యలు ఎదురయ్యాయి. అవతలి రాష్ట్రం అనుమతి ఉండాల్సిందేనన్న ఆదేశాలతో అంతరాష్ట్ర రవాణాపై తీవ్ర ప్రభావమే పడింది. ఇటీవల హైదరాబాద్‌లో లాక్ డౌన్ అనే ప్రచారం సమయంలో ఈ విషయం స్పష్టమైంది. తాజాగా కేంద్రం ఇచ్చిన ఆదేశాలు ఇలా ఇరుక్కుపోయిన వారికి పెద్ద ఉపశమనం అని అంటున్నారు.