జైలులో చంద్రబాబు విచారణ…ఇలా సాగుతోంది

స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబును 2 రోజులపాటు సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజమండ్రి జైలుకు విజయవాడ నుంచి సీఐడీ బృందం వెళ్లి విచారణ మొదలుబెట్టింది. 9 మంది అధికారులు చంద్రబాబును విచారణ జరపనున్నారు. చంద్రబాబు తరఫున న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్‌, గింజుపల్లి సుబ్బారావులు విచారణకు హాజరయ్యారు. ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో కాన్ఫరెన్స్‌ హాల్‌లో విచారణ జరుగుతోంది.

ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విచారణ జరగనుంది. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో వి.విజయ్‌భాస్కర్, ఎ.లక్ష్మీనారాయణ, ఎం.సత్యనారాయణ, మోహన్‌, రవికుమార్, శ్రీనివాసన్, సాంబశివరావు, రంగనాయకులు విచారణ జరుపుతున్నారు. విచారణ ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. విచారణ పూర్తైన తర్వాత కూడా వైద్య పరీక్షలు చేయనున్నారు. ప్రతి గంటకు 5 నిమిషాల విరామం ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 వరకు లంచ్ బ్రేక్. విచారణ ప్రక్రియ మొత్తం సీఐడీ డిపార్ట్‌మెంట్‌ వీడియో తీయనుంది. ఈ క్రమంలోనే రాజమండ్రి సెంట్రల్ జైలు పరిసర ప్రాంతాల్లో రెండంచెల భారీ బందోబస్తు, భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.

మరోవైపు, ఏపీ హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో ఈ తీర్పును చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఈ రోజు సవాల్ చేశారు. సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని పిటిషన్ లో ఆయన తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. దీంతో, సుప్రీం కోర్టులో అయినా చంద్రబాబుకు ఊరట దక్కుతుందా లేదా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.