జగన్ కు ‘బెయిల్ డే’ విషెస్ చెప్పిన లోకేష్

సీఎం జగన్ బెయిల్ మీద బయట ఉండి సీఎం అయ్యారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసుల్లో 16 నెలలు జైలులో ఉన్న జగన్…చంద్రబాబును కనీసం 16 రోజులైనా జైలులో ఉంచాలని కక్షగట్టారని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేస్ సెటైర్లు వేశారు. జగన్ గత పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారని, బెయిల్ డే వార్షికోత్సవ శుభాకాంక్షలు జైలు మోహన్ అని లోకేష్ ఎద్దేవా చేశారు.

సీబీఐ, ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1గా ఉన్న జగన్ రూ.42 వేల కోట్లు ప్ర‌జాధ‌నం దోచి ప‌దేళ్లుగా బెయిలుపై తిరుగుతున్నారని, ఆర్థిక ఉగ్ర‌వాది జైలు మోహ‌న్‌ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ల్ని ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాల‌రాస్తూ, నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నాడని లోకేష్ ఆరరోపిించారు. జైలులో ఉండాల్సిన జ‌గ‌న్ ప‌దేళ్లుగా బయట ఉంటే, జ‌నంలో ఉండాల్సిన నిజాయితీప‌రుడు సీబీఎన్ జైలులో ఉన్నారంటూ లోకేష్ విమర్శించారుు.

ఇక, జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కూడా విమర్శలు గుప్పించారు. పదేళ్లుగా జగన్ బెయిల్ పై ఉన్నారని, వైఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీ అవినీతికి పాల్పడిన జగన్‌ 23 సెప్టెంబరు 2013న బెయిల్ పై బయటకు వచ్చారని చురకలంటించారు. పదేళ్లుగా కోర్టుల నుంచి తప్పించుకుని బెయిల్ పై బయట తిరుగుతున్నారని, దేశంలో ఇదో రికార్డని ఎద్దేవా చేశారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో దీనిని నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రికార్డు సర్టిఫికెట్‌ను ఫ్రేమ్ కట్టి తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చి అందిస్తారని సెటైర్లు వేశారు. జగన్ విద్యార్హతల గురించి ఏ సర్టిఫికెట్ ఉందో ఎవరికీ తెలీదని, ఈ రికార్డు సర్టిఫికెట్‌ను జగన్ ఇంటి గోడలు, పార్టీ, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని చురకలంటించారు.