మానసిక క్షోభకు గురి చేస్తున్నారు: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు ఈ రోజు మధ్యాహ్నం రెండున్నర గంటలకు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దాంతోపాటు చంద్రబాబు రిమాండ్ ను ఈ నెల 24 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈ క్రమంలోనే రిమాండ్ పూర్తయిన చంద్రబాబును వర్చువల్ విధానంలో కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా న్యాయమూర్తితో చంద్రబాబు తన ఆవేదనను వ్యక్తం చేశారు. జైల్లో తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తన హక్కులను కాపాడాలని, న్యాయాన్ని రక్షించాలని న్యాయమూర్తిని చంద్రబాబు కోరారు.

కస్టడీపై న్యాయమూర్తి చంద్రబాబు అభిప్రాయాన్ని కోరగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కనీసం నోటీసులు ఇవ్వకుండా తనను అరెస్ట్ చేశారని చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన తప్పు ఉంటే విచారణ చేసి అరెస్ట్ చేయాలని ఆయన అన్నారు. తాను చేసిన అభివృద్ధి ఏపీ, తెలంగాణలో కనిపిస్తోందని అన్నారు. అన్యాయంగా తనను అరెస్ట్ చేశారు అన్నదే తన బాధ, ఆవేదన, ఆక్రందన అని చంద్రబాబు మనోవేదనకు గురయ్యారు. ఈ వయసులో తనకు ఇది పెద్ద పనిష్మెంట్ అని, తనపై ఉన్నవి ఆరోపణలు అని, అవి నిర్ధారణ కాలేదని చంద్రబాబు అన్నారు.

అయితే, చట్టాన్ని గౌరవిస్తానని, చట్టం ముందు అందరూ సమానమే అని, న్యాయానిదే అంతిమ విజయం కావాలని చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పోలీస్ కస్టడీలో లేరని జ్యుడీషియల్ కస్టడీలో మాత్రమే ఉన్నారని దానిని శిక్షగా భావించొద్దని చంద్రబాబుతో జడ్జి అన్నారు. చంద్రబాబుపై వచ్చినవి ఆరోపణలని, నేరం రుజువు కాలేదని చెప్పారు. చట్టం, నిబంధనల ప్రకారమే జ్యుడీషియల్ రిమాండ్ విధించామని అన్నారు‌. జైలులో సౌకర్యాల పరంగా ఇబ్బంది ఏమైనా ఉంటే తనకు చెప్పాలని న్యాయమూర్తి అన్నారు. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సిఐడి అడుగుతోందని, కస్టడీ అవసరం లేదని చంద్రబాబు తరఫున న్యాయవాదులు వాదిస్తున్నారని, అయితే చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పారు.