కాంగ్రెస్ గ్యారంటీల‌కు కౌంట‌ర్‌… డైరెక్టుగా రంగంలోకి మోడీ

తెలంగాణ‌లో ఎన్నిక‌ల రాజ‌కీయం హీటెక్కిన సంగ‌తి తెలిసిందే. ఓవైపు సంక్షేమ‌-అభివృద్ధి ప‌థ‌కాల‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన‌ధికార ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించారు. దీంతో అల‌ర్ట‌యిన కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌ల‌తో హైద‌రాబాద్‌లో సీడ‌బ్ల్యూసీ స‌మావేశం నిర్వ‌హించి, అనంత‌రం తుక్కుగూడలో విజయ భేరి పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆరు హామీలను ప్రకటించింది. 6 గ్యారెంటీలు, డిక్లరేషన్లతో తెలంగాణలో విజయం సాధిస్తామని కాంగ్రెస్ నేత‌ల్లో ధీమా వ్యక్తం అవుతోంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ రంగంలోకి దిగింది. ఏకంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తెలంగాణ ఎన్నికల్లో శంఖారావం పూరించేందుకు విచ్చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

బీఆర్ఎస్ పార్టీ ర‌థ‌సార‌థి, సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి కీల‌క హామీలు ఇస్తూ, వివిధ నిర్ణ‌యాలు ప్ర‌క‌టిస్తుండ‌ట‌మే కాకుండా బ‌రిలో దిగే అభ్య‌ర్థుల‌ను సైతం ప్ర‌క‌టించేశారు. దీంతో అల‌ర్ట‌యిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లో తాము బ‌ల‌ప‌డేందుకు ఉన్న అవ‌కాశాల‌ను అధ్య‌య‌నం చేస్తూ ఆరు గ్యారంటీల‌ను అందించింది. వివిధ పార్టీ నేత‌ల చేరిక‌తో బిజీ బిజీగా మారుతోంది. త‌ద్వారా ఆ పార్టీ క్షేత్ర‌స్థాయిలో త‌మ వ్యూహాల‌ను అమ‌లు చేస్తున్న బీజేపీ అధిష్టానం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు రంగం సిద్ధం చేస్తున్న‌ట్లు స‌మాచారం.

బీజేపీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం, ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుద‌ల చేసి అక్టోబర్ మొదటి వారంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోడీ పర్యటన ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు స‌మాచారం. అక్టోబరు 2, 3, 4 తేదీల్లో తెలంగాణలో మోడీ పర్యటించే అవకాశం ఉందని స‌మాచారం. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ప్రధాని మోదీ రోడ్ షో జరిగే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో నిర్వహించే పార్టీ బహిరంగ సభల్లో మోడీ పాల్గొంటారని సమాచారం. తెలంగాణ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని ఏకంగా ప్ర‌ధాని మోడీ పర్యటించ‌డం ప్రాధాన్యత సంతరించుకోనుంది.