రాబోయే తెలంగాణ ఎన్నికల కోసం ఒకేసారి 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రాజేశారు. కొన్ని స్థానాల్లో సిట్టింగ్ లకు పక్కనపెట్టిన కేసీఆర్.. మరో నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టారు. ఓ వైపు టికెట్ దక్కని నేతల నుంచి వచ్చిన అసమ్మతిని నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తున్నారు. మరోవైపు ఆ నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం టికెట్ల కోసం బీఆర్ఎస్ నేతల మధ్య హోరాహోరీ పోరు నడుస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా మెదక్ లోని నర్సాపూర్ నియోజకవర్గంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తనకే టికెట్ దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు.
నర్సాపూర్ నియోజకవర్గాన్ని వదిలేదే లేదని మదన్ రెడ్డి కుండ బద్ధలు కొడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని స్వయంగా ఆయనే ప్రకటించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని విమర్శించేలా మదన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. నాలుగు నియోజకవర్గాల టికెట్లను పెండింగ్ లో పెట్టడం సరికాదని మదన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నర్సాపూర్ లో టికెట్ ప్రకటించకపోవడంపై అసంత్రుప్తి వ్యక్తం చేశారు.
అయితే ఏది ఏమైనా మరోసారి తానే ఎమ్మెల్యేనని మదన్ రెడ్డి ప్రకటించుకోడం గమనార్హం. ఎవరు పోటీకి వచ్చినా వెనక్కి తగ్గేదేలేదని స్పష్టం చేశారు. మరో 15 రోజుల్లో 20 వేల మంది కార్యకర్తలతో భారీ బహిరంగ సభ కూడా పెడతానని చెప్పారు. నర్సాపూర్ టికెట్ కోసం మాజీ మంత్రి, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే కేసీఆర్ ను ఆమె కలిసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే టికెట్ తనకే రావాలనే గట్టి పట్టుదలతో మదన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని టాక్.
Gulte Telugu Telugu Political and Movie News Updates