తెలుగుదేశం పార్టీతో పొత్తును ప్రకటించిన తర్వాత తొలిసారి జరిగిన పార్టీ సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శల దాడిని మరింత పెంచాడు. జగన్ ఇగో, నిరంకుశ వైఖరిని మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశంలో పవన్ దుయ్యబట్టాడు.
జగన్ అహంకారం గురించి మాట్లాడుతూ.. 2019 ఎన్నికల అనంతరం ఒకసారి తాను జగన్‌కు ఫోన్ చేశానని.. తాను ఆయన్ని సార్ సార్ అని సంబోధిస్తుంటే.. జగన్ మాత్రం పవన్ పవన్ అంటూ తనను ఏకవచనంతో మాట్లాడాడని పవన్ అన్నాడు. 151 సీట్లలో గెలిచిన అహంకారం అప్పుడు జగన్ మాటల్లో కనిపించిందని పవన్ అన్నాడు. నాలుగేళ్లుగా అమ్మ, అక్క, ఆలి అంటూ తనను ఎన్నో బూతులు తిట్టారని.. ఎన్నెన్నో మాటలు అన్నారని.. అన్నింటినీ భరిస్తూ వచ్చినా ఇంకా కూడా వైసీపీ నేతల తీరు మారలేదని పవన్ అన్నాడు. కానీ ఇకపై ఊరుకునేది లేదని పవన్ హెచ్చరించాడు.
కనీసం తనను ఏపీలోకి అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకోవడం.. గృహ నిర్బంధం చేశారని.. పలుమార్లు తన పర్యటనలను అడ్డుకున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ఆ రాష్ట్రంలోకి వెళ్లడానికి పాస్ పోర్ట్, వీసా అవసరం అవుతుందని వ్యాఖ్యానించారని.. ఐతే తెలంగాణ వాళ్లు అలా ఏమీ చేయలేదని.. కానీ జగన్ మాత్రం ఏపీలోకి ఎవరు రావాలన్నా వీసా, పాస్ పోర్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి కల్పించాడని పవన్ ఎద్దేవా చేశాడు. జగన్‌కు పదవి ఉందని నియంతలా ప్రవర్తిస్తున్నాడని… ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని పవన్ అన్నాడు. ముఖ్య మంత్రి పదవి ఉందని ఓ ఫీలైపోవద్దని అంటూ.. నువ్వేమైనా దిగి వచ్చావా.. నువ్వెంత.. నీ బతుకెంత.. నీ స్థాయి ఎంత అంటూ జగన్ మీద పవన్ విరుచుకుపడ్డాడు. ఓట్లేసిన ప్రజలు కోపం వస్తే కొట్టి చంపేస్తారని హెచ్చరించాడు.