జ‌మిలి ఎన్నిక‌ల‌కు నో… తేల్చేసిన కాంగ్రెస్‌

దేశంలో జ‌మిలి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై అధ్య‌య‌నానికి ఇప్ప‌టికే మాజీ రాష్ట్ర‌ప‌తి నేతృత్వంలో ఒక క‌మిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే.. జ‌మిలి ఎన్నిక‌ల‌పై ప‌లు పార్టీల నుంచి భిన్న‌మైన అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బీజేపీని ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా స‌మ‌ర్థిస్తున్న పార్టీలు, నేత‌లు జ‌మిలికి మ‌ద్ద‌తిచ్చిన విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ పార్టీ మాత్రం జ‌మిలి ఎన్నిక‌ల‌కు నో చెప్పింది.

కాంగ్రెస్ పార్టీ జమిలి ఎన్నికల ప్రతిపాదనను తిరస్కరిస్తోందని ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి చిదంబ‌రం ప్రకటించారు. జమిలి ఎన్నికలు నిర్వహించటం అంటే రాష్ట్రాల హక్కులను అణచివేయటమేనన్నారు. అంతేకాదు, జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే.. పలు రాజ్యాంగ సవరణలు అవసరమని తెలిపారు. దీనికి సంబంధించి కేంద్రంలోని మోడీ స‌ర్కారుకు పార్ల‌మెంటులో తగిన సంఖ్యా బలం లేద‌న్నారు. ఈ క్ర‌మంలో జ‌మిలి ప్ర‌తిపాద‌న వృథా ప్ర‌యాసేన‌ని తేల్చి చెప్పారు.

హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశంలో ప‌లు అంశాల‌పై నాయ‌కులు చ‌ర్చించారు. ఆ విశేషాల‌ను చిదంబ‌రం మీడియాకు వివ‌రించారు. ఇండియా కూటమిని బలోపేతం చేయాలని సభ్యులు అభిప్రాయపడ్డారని, వీలైనంత వేగంగా సీట్ల సర్దుబాటు ఖరారు కావాలని చిదంబ‌రం పేర్కొన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న5 రాష్ట్రాలలో పార్టీ పరిస్ధితి ఆశాజనకంగా ఉందన్నారు.

సీడ‌బ్ల్యూ సీ భేటీలో చ‌ర్చించిన విష‌యాలు ఇవీ..

  • రాజకీయ, ఆర్ధిక పరిస్ధితులు, భద్రతా సవాళ్లు
  • రాజ్యాంగ, ఫెడరల్ వ్యవస్ధల బలహీనం
  • రాష్ట్రాల ఆదాయం గణనీయంగా తగ్గిపోవ‌డం
  • రాష్ట్రాల బాధ్యతలను నెరవేర్చటంలో అడ్డంకులు
  • కర్ణాటకలో బియ్యం పంపిణీ
  • హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి వైపరీత్యం
  • మ‌ణిపూర్ అల్ల‌ర్లు