బీఆర్ ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. కేవలం రెండు వాక్యాలతో కూడిన రాజీనామా పత్రాన్ని బీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు పంపించారు. “తెలంగాణ రాష్ట్ర సమితిలో నాకు సహకరించినందుకు ధన్యవాదాలు. పార్టీకి నా రాజీనామాను సమర్పిస్తున్నాను” అని మాత్రమే ఆయన పేర్కొన్నారు. అంతకు మించి.. తన రాజీనామాకు కారణాలు కానీ.. ఈ సందర్భంగా పార్టీపై విమర్శలు కానీ ఆయన చేయకపోవడం గమనార్హం.
ఎవరీ తుమ్మల?
తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న తుమ్మల ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి చెందిన నాయకుడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన గతంలో టీడీపీలో ఉన్న సమయంలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌తో సై అంటే సై అంటూ.. రాజకీయ పోరాటా లకు తెరదీసిన నాయకుడిగా ఆయనకు పేరుంది. వాస్తవానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యునిస్టుల ప్రభావం ఎక్కువ.
అలాంటి జిల్లాలో తెలుగు దేశం పార్టీ జెండాను రెపరెపలాడించడంలో తుమ్మల పాత్రను తక్కువగా అంచనా వేయలేం. అలాంటి నాయకుడు రాష్ట్ర విభజన తర్వాత.. బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఆయన ఓడిపోయినప్పటికీ.. ఆయనకు మంత్రి పదవిని ఇచ్చిన కేసీఆర్.. భక్తరామదాసు సాగు, తాగు నీటి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించారు. దీనిని సమర్థవంతంగా నిర్వహించడం తుమ్మలకు అప్పట్లో మంచి పేరు తెచ్చింది.
ఇక, గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిపిన కందాల ఉపేందర్‌రెడ్డి బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత నుంచి తుమ్మల ప్రభావం ఆ పార్టీలో తగ్గుతూ వచ్చింది. తర్వాత తర్వాత.. కేసీఆర్ కు కూడా ఆయన దూరమయ్యారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాల్లోనే ఆయన సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేల సమక్షంలో హస్తం పార్టీ గూటికి చేరనున్నట్టు తెలుస్తోంది.