టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు సహా ఆయనను రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచిన విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబును అక్రమంగా వైసీపీ ప్రభుత్వం జైల్లో ఉంచిందని, ప్రభుత్వం చెబుతున్న స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం అంటూ ఏమీ లేదని.. ఇదంతా రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగమేనని… పేర్కొంటూ.. టీడీపీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన విషయం తెలిసిందే.
‘చంద్రబాబుతో నేను’- అనే శీర్షికతో ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. సైకో ప్రభుత్వాన్ని ప్రశ్నించి.. ‘బాబుతోనే నేను’ అంటూ బలంగా చాటాలని ప్రజా చైతన్య కరపత్రాన్ని విడుదల చేసింది. 92612 92612 నంబర్ కు మిస్ట్ కాల్ ఇచ్చి చంద్రబాబు అరెస్టును వ్యతిరేకించాలని, బాబుతో నేను అని చాటి చెప్పాలని తెలుగు దేశం పార్టీ పిలుపునిచ్చింది.
చంద్రబాబు చేసిన తప్పు ఏంటి? అంటూ టీడీపీ నాయకులు ప్రజలకు లక్షలాదిగా కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. కరపత్రాల్లో టీడీపీ లేవనెత్తిన ప్రశ్నలు ఇవీ..
- నైపుణ్య శిక్షణ కేంద్రాల(స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్)తో మన బిడ్డలకు ఉద్యోగాలు కల్పించడం నేరమా అంటూ కరపత్రంలో ప్రశ్నించారు.
- కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యం అంటూ పగలు, రాత్రి కష్టపడటం తప్పా?
- ప్రజా సమస్యలు కోసం రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీయడం అపరాధమా?
- అవినీతిపై జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పాపమా?
- రాజకీయ కక్షతో చంద్రబాబుపై పెట్టిన కేసును ఖండిద్దాం.. తప్పుడు కేసులపై గళమెత్తుదాం.. జగన్ కుట్రను ఎండగడదాం.. ‘బాబుతో నేను’ అని చాటి చెపుదాం అని ఉన్న కరపత్రాలను గ్రామ, మండల, నగర, పట్టణ స్థాయిలో జోరుగా పంచుతున్నారు. బాబుతో నేను ఉద్యమాన్ని జోరుగా క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్తున్నారు. దీనికి ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తున్న విషయం తెలిసిందే.