రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ కు ఆయన కుటుంబ సభ్యులను ఈ రోజు అనుమతించారు. ముగ్గురు కుటుంబ సభ్యులకు అనుమతి లభించింది. ఈ క్రమంలోనే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి..జైలులో చంద్రబాబును కలిశారు. వారితోపాటు బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని, ఆమె భర్త భరత్ వచ్చినప్పటికీ అనుమతి లేక జైలు బయట ఉండాల్సి వచ్చింది. దాదాపు 45 నిమిషాల పాటు ములాఖత్ కు సమయం ఇచ్చారు.
ఈ క్రమంలోనే చంద్రబాబును కలిసిన తర్వాత భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. జైల్లో ఉన్న చంద్రబాబును కలిసి బయటకు వస్తుంటే తనలో ఒక భాగం అక్కడే వదిలేసినట్లుగా అనిపించిందని భువనేశ్వరి ఎమోషనల్ గా మాట్లాడారు. నిత్యం ప్రజల గురించి ఆలోచించే చంద్రబాబును జైల్లో చూడడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏమీ లేని కేసులో ఇరికించి ఆయనను జైల్లో పెట్టారని ఆరోపించారు. తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీ అనుక్షణం ప్రజల కోసమే పని చేస్తోందని, జైల్లో ఉండి కూడా ప్రజల కోసమే ఆయన పరితపిస్తున్నారని అన్నారు.
తాను ఆరోగ్యంగా, బాగానే ఉన్నానని, భయపడవద్దని ఆయన తనకు ధైర్యం చెప్పారని వెల్లడించారు. జైల్లో అన్ని సౌకర్యాలు ఉన్నట్లు కనిపించడం లేదని, చన్నీటితో స్నానం చేయాల్సి వస్తోందని చెప్పారు. చంద్రబాబు అరెస్టు కావడం తమ కుటుంబానికి, పార్టీకి కష్టసమయమని, ప్రజలంతా అండగా ఉండాలని ఆమె కోరారు. చంద్రబాబు భద్రత గురించి తాను ఆలోచిస్తున్నానని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates