ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలి పెట్టకుండా ఏపీ అధికారపక్ష నేతల్ని ఒక ఆట ఆడుకుంటున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తాజాగా ఏపీ మంత్రికి సింపుల్ సవాలు విసిరి.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తనను ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బాగుండదని హెచ్చరిస్తూ.. మాటలు కాదు.. దమ్ముంటే.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం నియోజకవర్గంలోకి వచ్చిన వినాయక చవితి పూజలు చేయాలని వార్నింగ్ ఇచ్చారు.
నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే బాగుండదన్న రఘురామ.. మంత్రి వెల్లంపల్లికి విసిరిన సవాలుకు ఏమని బదులిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ రెబల్ ఎంపీకి అంత ఆగ్రహం కలగటానికి కారణం.. అంతకు ముందు ఆయన్ను ఉద్దేశించి మంత్రి వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలే కారణమంటున్నారు. హైదరాబాద్ లో కూర్చున్న చంద్రబాబు మార్గదర్శకంలో ఢిల్లీలో కూర్చున్న రఘురామ పని చేస్తున్నారని మండిపడ్డారు.
రఘురామను పనికిమాలిన నాయకుడిగా అభివర్ణిస్తూ.. ఢిల్లీలో కూర్చొని హిందూ మతంపై సవతి ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ నుంచి రాకుండా తమపై విమర్శలు చేయటం తగదన్న వెల్లంపల్లి.. ప్రజల ప్రాణాల్ని.. బాగోగుల్ని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు.
ఈ విషయాల్ని ఇలా ఉంచితే.. ఎంపీ రఘురామ విసిరిన సవాలుకు మంత్రి వెల్లంపల్లి స్వీకరిస్తారా. ఆయన చెప్పినట్లే.. నరసాపురం ఎంపీ పరిధిలో వినాయక చవితి పూజలకు హాజరవుతారా? పార్టీకి ఒక పట్టాన కొరుకుడుపడని రెబల్ ఎంపీకి షాకిచ్చే అవకాశాన్ని మంత్రి వెల్లంపల్లి ఏ మేరకు వినియోగించుకుంటారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates