చంద్రబాబుకు ఏసీబీ కోర్టు తాజా షాక్

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హౌస్ రిమాండ్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు తిరస్కరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. రెండు రోజలు ఉత్కంఠకు తెరదించుతూ సీఐడీ తరఫు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన కోర్టు చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ ను తోసిపుచ్చింది. అంతకుముందు వాదనల సందర్భంగా జైలులో చంద్రబాబుకు తగిన భద్రత లేదని లూథ్రా వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వీవీఐపీ అని, ఆయనకు ఎన్ఎస్ జీ కమాండోల భద్రత ఉందని, జైలులో అది సాధ్యం కాదని లూథ్రా వాదించారు.

అయితే, ఇంటి వద్ద కన్నా జైలు దగ్గరే చాలా కట్టుదిట్టమైన భద్రత ఉందని ఏఏజీ సుధాకర్ వాదనలు వినిపించారు. దీంతో, సీఐడీ, ఏసీబీ తరఫు వాదనలతో ఏకీభవించిన కోర్టు…చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో, ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు చుక్కెదురైనట్లయింది. మరోవైపు, చంద్రబాబును 5 రోజుల పాటు కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది.

చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్న సంగతి తెలిసిందే. అయితే, చంద్రబాబు హోదా, వయసు, ఆరోగ్యం, భద్రతా కారణాల రీత్యా ఆయనకు హౌస్ రిమాండ్ కల్పించాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఆ పిటిషన్ పై ప్రభుత్వ తరఫు న్యాయవాది, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, లూథ్రాలు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును ఈ రోజుకు వాయిదా వేసింది.