నిన్న ఇంటర్వ్యూ.. ఈరోజు రాజీనామా

స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం రెండు రోజులుగా ఏపీ రాజకీయాల్లో ఎంతటి దుమారం రేపుతోందో తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు బలమైన ఆధారాలేమీ లేకున్నా.. జగన్ సర్కారు పట్టుబట్టి ఆయన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్‌కు సంబంధించిన నిధుల వినియోగంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బాబు హయాంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేసిన పీవీ రమేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే చంద్రబాబును సీఐడీ అధికారులు టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే పీవీ రమేష్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంలో పీవీ రమేష్ కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల తాలూకు వీడియోలు సంచలనం రేపాయి. ఆయన దాదాపుగా చంద్రబాబుకు ఈ కేసులో క్లీన్ చిట్ ఇచ్చేశారు. తన స్టేట్మెంట్ ఆధారంగా సీఐడీ అధికారులు కేసు పెట్టామనడం పట్ల ఆయన షాకయ్యారు కూడా.

ఐతే పీవీ రమేష్ జగన్ సర్కారును ఇరుకున పెట్టేలా.. చంద్రబాబుకు అనుకూలంగా స్టేట్మెంట్స్ ఇచ్చారో లేదో.. మరుసటి రోజు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పదవీ విరమణ తర్వాత మేఘా ఇంజినీరింగ్ కంపెనీలో ఉన్నతోద్యోగిగా ఉన్న పీవీ రమేష్.. ఈ రోజు తన పదవికి రాజీనామా చేశారు. అది కూడా ఏపీ సీఎం జగన్ లండన్ పర్యటనను ముగించుకుని ఏపీలో అడుగు పెట్టిన కాసేపటికే జరగడం గమనార్హం.

ఏపీలో ప్రభుత్వం మారాక కొంత ఇబ్బంది పడ్డ మేఘా కంపెనీకి .. కొన్నాళ్లకు జగన్ సర్కారుతో రాజీ కుదిరింది. ఈ ప్రభుత్వంలోనూ పెద్ద పెద్ద ప్రాజెక్టులను ఆ సంస్థ దక్కించుకుంది. కాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో పీవీ రమేష్ చేసిన ప్రకటనలు చూసి జగన్ అండ్ కో ఆగ్రహానికి గురయ్యారని.. ఈ నేపథ్యంలోనే మేఘా అధినేత కృష్ణారెడ్డికి, పీవీ రమేష్‌కు వాదన జరిగి ఉంటుందని.. ఈ క్రమంలోనే పీవీ రమేష్ రాజీనామా చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

నిజానికి స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయమై పీవీ రమేష్ సోమవారం ప్రెస్ మీట్ కూడా పెట్టాలనుకున్నారు. ఈ మేరకు మీడియాకు సమాచారం కూడా ఇచ్చారు. కానీ ఆయన్ని మేఘా అధినేత ఆపారని.. ఇంతలో మీడియా ఇంటర్వ్యూలు బయటికి రాగా.. పీవీ రమేష్ మేఘా నుంచి తప్పుకోక తప్పని పరిస్థితి తలెత్తిందని అంటున్నారు.