ఆధార్ తో పాన్ ను లింక్ చేశారా? లేదంటే తిప్పలే

ఆధార్ కార్డుతో పాన్ కార్డును అనుసంధానం చేయాల్సిన విషయం చాలా పాతదే. కాకుంటే.. ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకునే వాళ్లు తీసుకుంటే పట్టించుకోని వాళ్లు పిచ్చ లైట్ గా తీసుకోవటం తెలిసిందే.

ఇప్పుడు అలాంటి వారందరికి దిమ్మ తిరిగేలా షాకిచ్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ అయ్యింది. కేంద్రం తాజాగా డిసైడ్ చేసిన గడువు తేదీ లోపల ఆధార్ తో పాన్ ను అనుసంధానం చేయని పక్షంలో అలాంటి కార్డుల్ని.. రద్దు చేయాలన్న యోచనలో కేంద్రం ఉన్నట్లు చెబుతున్నారు.

తాజాగా దీనికి సంబంధించిన ఒక గడువు తేదీని మోడీ సర్కారు నిర్ణయించింది. 2021 మార్చి 31వ తేదీ లోపు ఆధార్ తో పాన్ కార్డును లింకు చేయించుకోవాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఇలా లింకు చేయని వారు దగ్గర దగ్గర 18 కోట్ల మంది ఉంటారన్నది ఒక అంచనా. దేశ జనాభా 130 కోట్లు అయితే.. కేవలం 15 మిలియన్ల మంది మాత్రమే ఐటీ రిటర్నులను దాఖలు చేసినట్లుగా తేల్చారు.

ఇక.. రిటర్ను జారీ చేసిన వారిలోనూ 2.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు 57 శాతం మంది ఉంటే.. 2.5 లక్షల నుంచి రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్న వారు పద్దెనిమిది శాతం కాగా.. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు పదిహేడు శాతం.. రూ.10 నుంచి రూ.50లక్షల మధ్య ఆదాయం ఉన్న వారు ఏడు శాతంగా లెక్క తేల్చారు.

ఇక.. వార్షికఆదాయం రూ.50 లక్షలకు పైనే ఉన్న వారు కేవలం ఒక్క శాతమేనని చెబుతున్నారు. ఇప్పటివరకు 32.71 కోట్లకు పైగా పాన్ కార్డుల్ని బయోమెట్రిక్ ఐడీ ఆధార్ తో అనుసంధానం చేశారు. ఇలా రెండు కార్డుల్ని అనుసంధానం చేయని వారిపై వేటు వేయనున్నారు.

గడిచిన కొద్ది కాలంగా ఒక్కో వ్యక్తి దగ్గర రెండో.. మూడేసి చొప్పున పాన్ కార్డులు ఉండటం వల్ల.. ఐటీ పన్ను కట్టకుండా తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఆధార్ తో ఒక్కసారి పాన్ కార్డును అనుసంధానం చేయటం తప్పనిసరి అయితే.. పన్ను ఎగవేత దారులకు భారీ షాక్ తగిలే ప్రమాదం పొంచి ఉన్నట్లే.