అధిష్ఠానం ఆదేశిస్తే గజ్వేల్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధం.. ఇదీ చాలా కాలంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెబుతున్న మాటలు. గజ్వేల్ సీఎం కేసీఆర్ నియోజకవర్గం. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీకి ఈటల సై అన్నారు. మరోవైపు ఈ సారి గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గజ్వేల్ లో కేసీఆర్ కు ప్రధాన పార్టీల నుంచి పోటీని ఇచ్చేదెవరనే ఆసక్తి నెలకొంది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తారనిపించింది. కానీ ఇప్పుడు ఈటల భార్య జమున పోటీకి సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న బీజేపీ ఆశావహుల నుంచి పార్టీ దరఖాస్తులు స్వీకరించింది. అయితే గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీకి ఈటల భార్య జమున పేరు మీద దరఖాస్తు రావడం చర్చనీయాంశంగా మారింది. జమున అభ్యర్థిత్వం కోసం కార్యకర్తలు దరఖాస్తు సమర్పించారు. దీంతో ప్రస్తుతం హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల మరోసారి అక్కడి నుంచే పోటీ చేసే ఆస్కారముంది.
గజ్వేల్ లో మాత్రం భార్యను నిలబెట్టాలని ఈటల చూస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు గజ్వేల్ టికెట్ కోసం ఈటల పేరుతోనూ కార్యకర్తలు దరఖాస్తు సమర్పించారు. అయితే ఇవి కార్యకర్తలు చేసిన దరఖాస్తులని, వీటితో ఈటలకు సంబంధం లేదని ఆయన వర్గం చెబుతోంది. హుజూరాబాద్ టికెట్ కోసం ఈటల దరఖాస్తు చేసుకోలేదు. అయితే ఈ దరఖాస్తు ప్రక్రియ అంతా ఉత్తదేనని, కీలక నాయకులకు ఎలాగో టికెట్లు వస్తాయనే టాక్ ఉంది.
మరోవైపు సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ కూడా బీజేపీ తరపున దరఖాస్తు చేసుకున్నారు. ఆందోలు టికెట్ కోసం ఆయన ఆర్జీ పెట్టుకున్నారు. ఇక సినీ నటి, నిర్మాత, దర్శకురాలు జీవిత ఏకంగా అయిదు నియోజకవర్గాల నుంచి టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. సనత్ నగర్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి కోసం జీవిత దరఖాస్తు సమర్పించారు. ఇందులో ఏదో ఒక దానికైనా టికెట్ రాకపోతుందా అన్నది ఆమె ఆలోచనగా తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates