మరింత దగ్గరవుతున్న టీడీపీ జనసేన

తెలుగుదేశం పార్టీ, జనసేనలు మరింత దగ్గరవుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు అరెస్టయి రిమాండుకు వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మొత్తం ఎపిసోడ్ లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ టీడీపీకి మద్దతుగా నిలిచారు. అప్రజాస్వామికంగా చంద్రబాబును అరెస్టుచేయటాన్ని పవన్ ఖండించారు. అరెస్టుకు నిరసనగా చంద్రబాబుకు మద్దతు ప్రకటించి విజయవాడ వస్తున్న పవన్ను కుంచనపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో తన వెహికల్లో నుండి పవన్ బయటకు వచ్చి నడిరోడ్డు మీద పడుకుని నిరసన తెలిపారు.

తర్వాత మంగళగిరి పార్టీ ఆఫీసుకు చేరుకున్న వెంటనే నేతలతో సమావేశమయ్యారు. చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడటమే కాకుండా జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. జగన్ ను తరిమికొట్టకపోతే ఏపీలో ఎవరూ బతకలేరంటు మండిపోయారు. వెంటనే లోకేష్ కు ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. టీడీపీ పిలుపిచ్చిన రాష్ట్ర బంద్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఒకటి రెండు రోజుల్లోనే అటు రాజమండ్రిలో చంద్రబాబును కలిసేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అలాగే లోకేష్ తో కూడా భేటీ అవబోతున్నారు. ఇదంతా చూసిన తర్వాత ఇప్పటికన్నా భవిష్యత్తుల్లో రెండు పార్టీలు మరింత సన్నిహితం అవబోతున్నట్లు అర్ధమైపోతోంది. ఎందుకంటే ఇద్దరికి కామన్ శతృవు జగన్ మాత్రమే. విడివిడిగా పోరాటం చేస్తే వైసీపీని రాబోయే ఎన్నికల్లో ఓడించటం సాధ్యంకాదని ఇప్పటికే అనేక సందర్భాల్లో చంద్రబాబు, పవన్ బహిరంగంగానే చెప్పిన విషయం తెలిసిందే.

అందుకనే పొత్తుపెట్టుకుని పోరాటాలు చేయాల్సిందే అని అనుకుంటున్నారు. అయితే బీజేపీ విషయం తేలకపోవటంతో రెండుపార్టీల మధ్య పొత్తుల చర్చలు ముందుకు సాగటంలేదు. అయితే ఇపుడు చంద్రబాబు అరెస్టన్నది సడెన్ డెవలప్మెంట్. కాబట్టి బీజేపీని పక్కనపెట్టేసైనా సరే టీడీపీతో కలవాలని పవన్ అనుకుంటున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇందుకు వీలుగానే పవన్ తన పార్టీ కార్యాచరణ ప్రాణాళికను రెడీచేస్తున్నారు. ఇప్పటికే రెండుపార్టీల మధ్య పొత్తు ఫైనల్ అయిపోయిందనే ప్రచారం అందరికీ తెలిసిందే. కాబట్టి తాజా పరిస్ధితులు భేరీజు వేసుకున్న తర్వాతే టీడీపీకి అన్నీవిధాలుగా మద్దతుగా నిలబడాలని పవన్ డిసైడ్ అయ్యారు.