మైనంపల్లి అయోమయంలో పడ్డారా ?

మల్కాజ్ గిరి ఎంఎల్ఏ మైనంపల్లి హనుమంతరావు పూర్తిగా అయోమయంలో పడినట్లు అర్ధమవుతోంది. మూడు వారాల క్రితం కేసీయార్ అభ్యర్ధులను ప్రకటించినపుడు మల్కాజ్ గిరికి టికెట్ కన్ఫర్మ్ చేశారు. అయితే మైనంపల్లి మాత్రం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎందుకంటే తనతో పాటు తన కొడుకు రోహిత్ కు మెదక్ అసెంబ్లీ టికెట్ ఇస్తేనే తాను పోటీ చేస్తానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అయితే మైనంపల్లి డిమాండును కేసీయార్ పట్టించుకోకుండా మల్కాజ్ గిరిలో మైనంపల్లికి మాత్రమే టికెట్ ఇచ్చారు.

దీంతో కేసీఆర్ తో పాటు హరీష్ రావుపైన కూడా మైనంపల్లి నోటికొచ్చినట్లు మాట్లాడారు. దాంతో కేసీయార్ కు ఎంఎల్ఏకి బాగా గ్యాప్ వచ్చేసింది. ఇదే విషయమై కేసీఆర్ మాట్లాడుతూ టికెట్ తీసుకోవటం తీసుకోకపోవటం మైనంపల్లి ఇష్టమన్నారు. ఇష్టముంటే పార్టీలో ఉంటారు లేకపోతే ఏమిచేయాలో ఆయనిష్టం అన్నట్లుగా మాట్లాడారు. దాంతో కేసీయార్ కు తన తడాఖా ఏమిటో చూపిస్తానని బహిరంగంగానే చాలెంజ్ విసిరారు.

దాంతో మైనంపల్లి పార్టీ మారటం ఖాయమని, కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ప్రచారం మొదలైంది. అయితే కాంగ్రెస్ లో చేరినా పెద్దగా ఉపయోగం ఉండదన్నది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ లో మైనంపల్లికి టికెట్ దక్కుతుందేమో కానీ ఆయన కొడుక్కి దక్కే అవకాశంలేదు. మహాయితే బీజేపీలో మాత్రమే తండ్రి, కొడుకులకు టికెట్ దక్కే అవకాశముంది. టికెట్లు దక్కుతాయేమో కానీ గెలుపు గ్యారెంటీలేదు. అందుకనే బీజేపీలో చేరటంపై మైనంపల్లి ఆలోచిస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే తిరుమల శ్రీవారి దర్శనార్ధం వెళ్ళిన మైనంపల్లి మీడియాలో మాట్లాడుతు పదిరోజుల తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. ముందు నియోజకవర్గంలో పర్యటించి తర్వాత నిర్ణయం ప్రకటిస్తానన్నారు. దీంతో మైనంపల్లి పార్టీ మారే విషయంలో పునరాలోచనలో పడినట్లు అందరు అనుమానిస్తున్నారు. నిజానికి తనతో పాటు తన కొడుక్కి కూడా టికెట్ ఇవ్వాలన్న డిమాండే అర్ధంలేనిది. ఉన్నదే 119 నియోజకవర్గాలు అయినపుడు తండ్రి, కొడుకులకు టికెట్ ఇవ్వటం కష్టమని తెలీదా ? అనాలోచితంగా చేసిన డిమాండే ఇపుడు ఎంఎల్ఏ మెడకే చుట్టకుంటోంది. మరి పదిరోజుల తర్వాత ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.